జూన్ 2న హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం : టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి  

జూన్ 2న హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం : టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి  

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ,  ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను జూన్ 2న నెరవేర్చకపోతే ప్రభుత్వ అగ్రహానికి గురికావాల్సి వస్తుందని  టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి హెచ్చరించారు. హామీల అమలులో జాప్యం జరిగితే పీఆర్టీయూ టీఎస్ పీఆర్టీయూ ఆధ్వర్యంలోఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని పీఆర్టీయూ ఆఫీసులో ఆ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శ్రీపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉద్యోగులు, టీచర్లకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా అమలుకు నోచుకోవడం లేదని శ్రీపాల్ రెడ్డి విమర్శించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి...  జేఏసీతో సమావేశమై వేతన సవరణ, హెల్త్ కార్డులను జూన్ 2 నుంచి అమలు చేస్తామని, పెండింగ్ బకాయిలను వంద రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఆ మాట నిలబెట్టుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. టీచర్లకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని, నగదు రహిత వైద్యం కోసం హెల్త్ కార్డులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం సంఘంలో 72 వేల మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పి. వెంకటరెడ్డి, గుండు లక్ష్మణ్, జగన్ మోహన్ , శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.