టీచర్ల లెక్కలు ఇయ్యాల ఫైనల్?

టీచర్ల లెక్కలు ఇయ్యాల ఫైనల్?

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రకారం కేడర్ స్ర్టెంత్ అలకేషన్ కోసం విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఉమ్మడి జిల్లాల్లో ఎన్ని శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయి? ప్రస్తుతం ఎంతమంది పని చేస్తున్నారు? అనే వివరాలను సేకరిస్తోంది. మూడు రోజుల క్రితం డీఈవోలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, విద్యాశాఖ అధికారులు సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాల పరిధిలోని హెడ్‌మాస్టర్లు, అన్ని సబ్జెక్టులు, మీడియం వైజ్ టీచర్ల వివరాలు, నాన్ టీచింగ్ పోస్టుల వివరాలు తీసుకున్నారు. ఏ జిల్లాలో ఎంత మంది వర్క్ చేస్తున్నారనేది లెక్క గట్టారు. డైట్, బీఈడీ కాలేజీల్లోని పోస్టుల వివరాలు, డీఈవో, ఎంఈవో ఆఫీసుల్లో సిబ్బంది సమాచారం కూడా తీసుకున్నారు.

తాజాగా డీఈవోలు, ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, హైస్కూల్ హెచ్​ఎంలు, సీఆర్సీలతో సమావేశాలు నిర్వహించారు. దీంట్లో స్కూల్స్, సబ్జెక్టు, కేటగిరీ, మీడియం, మేనేజ్‌మెంట్ వారిగా ప్రతి పోస్టును తనిఖీ చేసిన తర్వాత రిపోర్టు పంపించాలని ఆదేశించారు. ఈ లెక్కలను ఆదివారం మధ్యాహ్నంలోపే పంపించాలని డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. ఈ లెక్కలపై మరోసారి సోమవారం డైరెక్టరేట్​లో ఉదయం డీఈవోలతో సమావేశం కావాలని సూచించారు. కేడర్‌‌ స్ర్టెంత్ వివరాలను ఫైనల్ చేసి, డీఈవోలు సంతకాలు చేసి తీసుకురావాలని ఆదేశించారు. సోమవారం లెక్కలను ఫైనల్ చేసే అవకాశముందని చెప్తున్నారు. 

1,956 హెచ్​ఎం పోస్టులు ఖాళీ 
రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో1,956 గ్రేడ్​–2 హెచ్​ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు లెక్కలేశారు. మొత్తం 4,379 పోస్టులు శాంక్షన్డ్ కాగా, వాటిలో 2,423 మంది పనిచేస్తున్నట్టు తెలిసింది. లోకల్ బాడీ స్కూళ్లలో 3,934 మందికి గాను 2,189 మంది, గవర్నమెంట్ స్కూళ్లలో 445 మందికి గాను 234 మంది పని చేస్తున్నట్టు  సమాచారం.