తప్పురాశాడని విద్యార్ధిని చితకొట్టిన ఉపాధ్యాయుడు

తప్పురాశాడని విద్యార్ధిని చితకొట్టిన ఉపాధ్యాయుడు

తప్పులు రాస్తే సరి చేసి అర్ధమయ్యేలా చెప్పాల్సిన ఉపాధ్యయుడు..ఓ విద్యార్థిని చితకొట్టాడు. అయితే ఆ విద్యార్ధి చేసింది చెప్పలేనంత పెద్ద తప్పు కాదు. ఆకలికి బదులుగా అకలి అని రాశాడు. దీంతో ఆ విద్యార్ధి ఒళ్లు హూనం అయ్యేలా కొట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జల్లాలో జరిగింది.

భీమ్‌గల్‌ మండలం పిప్రి గ్రామానికి చెందిన సంజయ్‌ ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి సెయింట్‌ పాల్స్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం ట్యూషన్‌ లో స్కూలు నిర్వాహకుడు బబ్లూ పాఠాలు చెబుతూ నోట్స్ రాయించాడు. ఇందులో భాగంగా సంజయ్  ఆకలికి బదులు అకలి అని రాశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బబ్లూ కర్రతో ఇష్టమొచ్చినట్లు వీపుపై కొట్టడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాదు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంజయ్ తల్లిదండ్రులు స్కూల్‌ యజమానిపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్కూలు యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.