ఒళ్లు దగ్గర పెట్టుకో.. హరీశ్కు ఉద్యోగ సంఘాల హెచ్చరిక

ఒళ్లు దగ్గర పెట్టుకో.. హరీశ్కు ఉద్యోగ సంఘాల హెచ్చరిక
  •     ఉద్యోగుల జీతాలపై హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు చేసిన వ్యాఖ్యలు సరికావు 
  •     ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి: ఉద్యోగ సంఘాల హెచ్చరిక
  •     కామెంట్లు వెనక్కి తీసుకోవాలని టీచర్ల సంఘాల డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు :  మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు వ్యాఖ్యలపై టీచర్లు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతులను గౌరవించాలని, అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర మర్చిపోవద్దన్నారు. ఏసీల్లో ఉండే ఉద్యోగులకు ముందుగా జీతాలు ఇస్తున్నారనే హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలిస్తుంటే హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషం కక్కుతున్నారని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీటీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావుకు ఒకటో తేదీన జీతాలివ్వాలనే నిబంధనలు ఉన్నాయనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

 ఉద్యోగుల వేతనాలపై హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు వ్యాఖ్యలు సరైనవి కాదని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు అన్నారు. 35 రోజుల పాటు తమ వేతనాలను, ఉద్యోగాలను పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కటకం రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పుకొని.. చేతల్లో మాత్రం ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. రైతుల్లో ఉద్యోగులపై వ్యతిరేకత కలిగించడం సరైంది కాదన్నారు.