మమ్మల్ని సొంత జిల్లాలకు కేటాయించాలి

మమ్మల్ని సొంత జిల్లాలకు కేటాయించాలి
  • జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ 

ముషీరాబాద్,వెలుగు: జీవో  317 కింద నాన్ స్పౌజ్ టీచర్లను స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు కేటాయించాలని బాధిత టీచర్ల జేఏసీ డిమాండ్ చేసింది. తమను స్థానికత ఆధారంగా సర్దుబాటు చేయాలని కోరింది. ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో జేఏసీ ఆధ్వర్యంలో మనోవేదన మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు విజయ్ కుమార్, దత్తాద్రి, నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 

రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన సీఎం కేసీఆర్ ఎలాంటి ఆర్థిక భారం లేని నాన్ స్పౌజ్ టీచర్ల  సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. 20 నెలలుగా స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరంగా ఉంటూ జాబ్​ చేస్తూ మానసిక క్షోభను అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలు దాటి వందల  కిలోమీటర్లు ప్రయాణిస్తుండగా  ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మహిళా టీచర్లు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. స్థానిక జిల్లాల్లో టీచర్ల ఖాళీలు ఉన్నాయని, స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలని కోరారు. ఈ మనోవేదన సభలో టీచర్లు మల్లికా, కృష్ణవేణి, జెస్సీ, చాముండేశ్వరి, సాయి భగవత్, పృథ్వీరాజ్, ప్రశాంత్ పాల్గొన్నారు.