కేజీబీవీ టీచర్లకు ఆరునెలల ప్రసూతి సెలవులు కావాలి

కేజీబీవీ టీచర్లకు ఆరునెలల ప్రసూతి సెలవులు కావాలి

హైదరాబాద్, వెలుగు: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న టీచర్లకు ఆరునెలల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ టీచర్స్ జేఏసీ చైర్మన్ పి.శ్రీపాల్​రెడ్డి డిమాండ్ చేశారు. సర్కారు బడుల్లో సౌకర్యాలు కల్పించాలని, కంప్యూటర్ విద్యను పునరుద్ధరించాలని కోరారు. సోమవారం పీఆర్టీయూటీఎస్​స్టేట్ ఆఫీస్​లో టీటీజేఏసీ సమావేశం జరిగింది. తర్వాత టీచర్​ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్​రెడ్డి, కూర రఘోత్తంరెడ్డిలతో జేఏసీ ప్రతినిధి బృందం కలిసి వెళ్లి.. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందించారు. టీచర్లు, ఉద్యోగులకు 45 శాతం ఫిట్ మెంట్​తో వెంటనే పీఆర్సీని ప్రకటించాలని కోరారు. శ్రీపాల్​రెడ్డి మాట్లాడుతూ.. మోడల్​స్కూల్​టీచర్లకు తెలంగాణ ఇంక్రిమెంట్​వర్తింపజేయాలని, బడుల కరెంట్​బిల్లును కేటగిరీ–7 నుంచి కేటగిరీ–1కి మార్చాలన్నారు. సమస్యల పరిష్కారానికి మినిస్టర్​సానుకూలంగా స్పందించినట్టు నేతలు చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో టీటీజేఏసీ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, పీఆర్టీయూ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్​రావు, టీపీయూఎస్​రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్, టీటీజేఏసీ రాష్ర్ట నేతలు అబ్దుల్లా, సోమేశ్వర్​రావు, విశ్వనాథ సత్యం, శంకర్, రాజయ్య, వెంకటనారాయణ, బాలరాజు తదితరులు ఉన్నారు.

పాత జిల్లాల ప్రకారమే టీచర్ల ప్రమోషన్లు

టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి పాతజిల్లాల ప్రకారమే ప్రతిపాదనలు తయారుచేసి పంపాలని అధికారులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. స్కూల్​ ఎడ్యుకేషన్​ సమస్యలపై సోమవారం టీచర్​ఎమ్మెల్సీలతో మంత్రి సమావేశమయ్యారు. స్పౌజ్ కేసులకు సంబంధించి అంతర్ జిల్లా బదిలీలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు తొందరగా పంపాలన్నారు. టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్కూళ్లలో ఇంగ్లిష్​ మీడియం అప్​గ్రేడ్​చేసే అధికారాన్ని జిల్లా అధికారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, జనార్దన్ రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి పాల్గొన్నారు.