పాత పెన్షన్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లడం సరికాదు..ఉపాధ్యాయ సంఘాలు

పాత పెన్షన్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లడం సరికాదు..ఉపాధ్యాయ సంఘాలు

 హైదరాబాద్, వెలుగు: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా సర్కారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడంపై ఉపాధ్యా య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పీఆర్టీయూటీఎస్, యూటీఎఫ్​, తపస్, ఎస్టీయూ, టీపీటీఎఫ్, టీఎస్టీయూ తదితర సంఘాలు శనివారం వేర్వేరుగా ప్రకటనలు రిలీజ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం హేయమైన చర్య అని పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్లం దామోదర్ రెడ్డి, భిక్షంగౌడ్ అన్నారు.

ఒకవైపు చర్చలు జరుపుతూనే ఇలా చేయడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని తపస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, పెంటయ్య, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనిల్ కుమార్, తిరుపతి అభిప్రాయపడ్డారు. టీచర్లకు పాత పెన్షన్​నిరాకరించడం వివక్షేనని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందంగౌడ్, గజేందర్ పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల ప్రభుత్వం, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్లా, రాజిరెడ్డి  విమర్శించారు. పాత పెన్షన్ అమలు చేస్తూ జీవో ఇవ్వకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.