సిరీస్‌‌‌‌పై టీమిండియా గురి.. నేడు (జులై 09) ఇంగ్లండ్‌‌‌‌తో నాలుగో టీ20.. రాత్రి 11 నుంచి..

సిరీస్‌‌‌‌పై టీమిండియా గురి.. నేడు (జులై 09) ఇంగ్లండ్‌‌‌‌తో నాలుగో టీ20.. రాత్రి 11 నుంచి..

మాంచెస్టర్‌‌‌‌: ఇండియా విమెన్స్‌‌‌‌ జట్టు.. ఇంగ్లండ్‌‌‌‌తో నాలుగో టీ20 మ్యాచ్‌‌‌‌కు రెడీ అయ్యింది. బుధవారం జరిగే ఈ పోరులో ఎలాగైనా గెలిచి సిరీస్‌‌‌‌ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో ప్రస్తుతం టీమిండియా 2–1 ఆధిక్యంలో ఉంది. మూడో టీ20లో ఐదు రన్స్‌‌‌‌ స్వల్ప తేడాతో ఓడిన ఇండియా ఈ మ్యాచ్‌‌‌‌లో ప్రధానంగా బ్యాటర్లపై దృష్టి పెట్టనుంది. 

ఆరంభంలో నెమ్మదిగా ఆడుతున్న హార్డ్‌‌‌‌ హిట్టర్‌‌‌‌ షెఫాలీ వర్మ, కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ మరింత దూకుడుగా ఆడాలని కోరుకుంటోంది. ఎనిమిది నెలల విరామం తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన షెఫాలీ తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో 23 రన్స్‌‌‌‌ మాత్రమే చేసింది. కానీ మూడో టీ20లో 47 పరుగులతో ఫామ్‌‌‌‌లోకొచ్చింది. దాంతో ఈ మ్యాచ్‌‌‌‌లో ఓ భారీ స్కోరుపై కన్నేసింది. స్మృతి మంధాన, జెమీమా, అమన్‌‌‌‌జోత్‌‌‌‌ కౌర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. 

తల గాయంతో తొలి మ్యాచ్‌‌‌‌కు దూరమైన హర్మన్‌‌‌‌ తర్వాతి రెండు టీ20ల్లో 24 రన్స్‌‌‌‌కే పరిమితమైంది. హర్మన్‌‌‌‌ కోసం ప్లేస్‌‌‌‌ త్యాగం చేసిన హర్లీన్‌‌‌‌ డియోల్‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌లో అద్భుతంగా ఆడింది. ఇక బౌలింగ్‌‌‌‌లో ఇండియాకు పెద్దగా ఇబ్బందుల్లేవు. స్పిన్నర్లు శ్రీచరణి (8), దీప్తి శర్మ (6)తో పాటు పేసర్‌‌‌‌ అరుంధతి రెడ్డి (4) ఈ సిరీస్‌‌‌‌లో ఆకట్టుకున్నారు. వాళ్లు ఇదే ఫామ్‌‌‌‌ను కంటిన్యూ చేస్తే ఇంగ్లండ్‌‌‌‌కు మరోసారి కష్టాలు తప్పవు. 

అయితే లెఫ్టార్మ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ రాధా యాదవ్‌‌‌‌, పేసర్‌‌‌‌ అమన్‌‌‌‌జోత్‌‌‌‌ మరింత సహకారం అందించాల్సి ఉంది. మరోవైపు మూడో మ్యాచ్‌‌‌‌లో నెగ్గి ఊపుమీదున్న ఇంగ్లండ్‌‌‌‌ దాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో సిరీస్‌‌‌‌ను 2–2తో సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జరగాలంటే ఇంగ్లిష్‌‌‌‌ బ్యాటర్లు మరింత మెరవాల్సి ఉంది. ఓపెనర్లు సోఫియా డంక్లీ, డానీ వ్యాట్‌‌‌‌ సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్నా.. క్యాప్సీ, స్కోల్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌, అమీ జోన్స్‌‌‌‌, బ్యూమోంట్‌‌‌‌, ఎకిల్‌‌‌‌స్టోన్‌‌‌‌ రాణించాల్సి ఉంది. బౌలింగ్‌‌‌‌లో ఎకిల్‌‌‌‌స్టోన్‌‌‌‌, ఇసీ వాంగ్‌‌‌‌, లారెన్‌‌‌‌ ఫిలర్‌‌‌‌, లారెన్‌‌‌‌ బెల్‌‌‌‌పై ఎక్కువ ఆశలు ఉన్నాయి.