టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌లో టీమిండియా ఫస్ట్‌‌ విక్టరీ

టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌లో టీమిండియా ఫస్ట్‌‌ విక్టరీ
  • అఫ్గానిస్తాన్‌‌పై 66 రన్స్​ తేడాతో విజయం
  • చెలరేగిన రోహిత్‌‌, రాహుల్‌‌, పాండ్యా

అబుదాబి: హమ్మయ్యా.. ఎట్టకేలకు టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌లో ఇండియా బోణీ చేసింది. రెండు వరుస పరాజయాలతో డీలా పడిపోయి.. విమర్శల జడివానలో తడిసి ముద్దైన బ్యాటర్లు.. అఫ్గానిస్తాన్‌‌ను కసిదీరా కొట్టారు. దీంతో బుధవారం జరిగిన సూపర్‌‌–12, గ్రూప్‌‌–2 లీగ్‌‌ మ్యాచ్‌‌లో కోహ్లీసేన 66 రన్స్​ తేడాతో అఫ్గాన్‌‌పై గ్రాండ్‌‌ విక్టరీ సాధించింది. ఓపెనర్లు రోహిత్‌‌ శర్మ (47 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74), కేఎల్‌‌ రాహుల్‌‌ (48 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69) దంచికొట్టడంతో.. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 210 రన్స్‌‌ చేసింది. ఈ టోర్నీలో ఇదే హయ్యెస్ట్‌‌ స్కోర్. తర్వాత రిషబ్‌‌ పంత్‌‌ (13 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 3 సిక్సర్లతో 27 నాటౌట్‌‌), హార్దిక్‌‌ పాండ్యా (13 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 నాటౌట్‌‌) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో అఫ్గాన్‌‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 144  రన్స్‌‌కు మాత్రమే పరిమితమైంది. కరీమ్‌‌ జనత్‌‌ (42 నాటౌట్‌‌) టాప్‌‌ స్కోరర్‌‌. మహ్మద్‌‌ నబీ (35) ఫర్వాలేదనిపించాడు. రోహిత్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 
మెగా పార్ట్‌‌నర్‌‌షిప్‌‌
పాకిస్తాన్‌‌, న్యూజిలాండ్‌‌పై తేలిపోయిన ఓపెనర్లు రోహిత్‌‌, రాహుల్‌‌.. అనుభవం లేని అఫ్గాన్‌‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. బాల్స్‌‌లో స్పీడ్‌‌, స్వింగ్‌‌ లేకపోవడంతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. రెండో ఓవర్‌‌లో స్పిన్నర్‌‌ అష్రాఫ్‌‌ను దించినా పెద్దగా ఫలించలేదు. స్టార్టింగ్‌‌లో రోహిత్‌‌ రెండు ఫోర్లతో టచ్‌‌లోకి వస్తే, సెకండ్‌‌ ఓవర్‌‌లో రాహుల్‌‌ 6, 4తో జోరు చూపెట్టాడు. తర్వాతి రెండు ఓవర్లు కాస్త నెమ్మదించినా, ఐదో ఓవర్‌‌లో హిట్‌‌మ్యాన్‌‌ 4, 6, 4తో 17 రన్స్‌‌ బాదాడు. దీంతో పవర్‌‌ప్లేలో ఇండియా 53/0 స్కోరు చేసింది. ఈ దశలో స్టార్‌‌ స్పిన్నర్‌‌ రషీద్‌‌ను తీసుకొచ్చినా రోహిత్‌‌, రాహుల్‌‌ రన్‌‌రేట్‌‌ను మాత్రం తగ్గనీయలేదు. నాలుగు ఓవర్లలో 32 రన్స్‌‌ రాబట్టడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో ఇండియా 85/0తో మంచి స్థితికి చేరింది. నవీన్‌‌ వేసిన 12వ ఓవర్‌‌లో రోహిత్‌‌ రెండు ఫోర్లు, రాహుల్‌‌ సిక్స్‌‌తో 16 రన్స్‌‌ వచ్చాయి. ఆ వెంటనే రాహుల్‌‌ మరో రెండు ఫోర్లు కొట్టాడు. రషీద్‌‌ (14వ) ఓవర్‌‌లో రోహిత్‌‌ బ్యాక్‌‌ టు బ్యాక్‌‌ సిక్సర్లతో 16 రన్స్‌‌ పిండాడు. కానీ నెక్స్ట్‌‌ ఓవర్‌‌లో కరీమ్‌‌ (1/7) బాల్‌‌కు ఎక్స్‌‌ట్రా కవర్స్‌‌లో నబీకి క్యాచ్‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 140 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. మరో 10 బాల్స్‌‌ తర్వాత రాహుల్‌‌ కూడా ఔటయ్యాడు. 
3.3 ఓవర్స్‌‌ 63 రన్స్‌‌
ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్‌‌, హార్దిక్‌‌.. ఇన్నింగ్స్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌ వరకు అఫ్గాన్‌‌ బౌలర్లను అల్లాడించారు. రిషబ్‌‌ రెండుసార్లు రివ్యూలో బయటపడ్డాడు. 17వ ఓవర్‌‌లో రాహుల్‌‌ థర్డ్‌‌ బాల్‌‌కు ఔటైతే, లాస్ట్‌‌ రెండు బాల్స్‌‌ను పంత్‌‌ సిక్సర్లుగా మలిచాడు. నెక్స్ట్‌‌ ఓవర్‌‌లో పాండ్యా మూడు ఫోర్లతో 15 రన్స్‌‌ సాధించాడు. 19వ ఓవర్‌‌లో హార్దిక్‌‌ రెండు సిక్సర్లు, లాస్ట్‌‌ ఓవర్‌‌లో పంత్‌‌ 6, 4, హార్దిక్‌‌ ఫోర్‌‌ కొట్టాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌‌కు 21 బాల్స్‌‌లో 63 రన్స్‌‌ జోడించారు. 

సంక్షిప్త స్కోరు: 
ఇండియా: 20 ఓవర్లలో 210/2 (రోహిత్‌‌ 74, రాహుల్‌‌ 69, పాండ్యా 35 *, కరీమ్‌‌ జనత్‌‌ 1/7), అఫ్గానిస్తాన్‌‌: 20 ఓవర్లలో 144/7 (కరీమ్‌‌ జనత్‌‌ 42*, నబీ 35, షమీ 3/32).

సూపర్‌‌.. షమీ
భారీ లక్ష్య ఛేదనలో అఫ్గాన్‌‌ను టీమిండియా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. పేసర్లు లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌కు కట్టుబడితే స్పిన్నర్‌‌ అశ్విన్‌‌ (2/14) తన మ్యాజిక్‌‌ చూపెట్టాడు. 13 రన్స్‌‌కే ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌‌ (13), షెహజాద్‌‌ (0)ను బుమ్రా (1/25), షమీ (3/32) పెవిలియన్‌‌కు పంపారు. గుర్బాజ్‌‌ (19), గుల్బాదిన్‌‌ (18) ఇన్నింగ్స్‌‌ నిలబెట్టే ప్రయత్నం చేశారు. గుర్బాజ్‌‌ రెండు సిక్సర్లతో జోరు పెంచే ప్రయత్నం చేసినా జడేజా స్పిన్‌‌కు ఎదురు నిలువలేకపోయాడు. మూడో వికెట్‌‌కు 35 రన్స్‌‌ జోడించి గుర్బాజ్‌‌ ఔటయ్యాడు. గుల్బాదిన్‌‌తో జతకలిసిన జద్రాన్‌‌ (11)ను అశ్విన్‌‌ కట్టడి చేశాడు. వరుస ఓవర్లలో ఈ ఇదర్ని ఔట్‌‌ చేయడంతో 69 రన్స్‌‌కే సగం  అఫ్గాన్‌‌ టీమ్‌‌ పెవిలియన్‌‌కు చేరుకుంది. ఈ దశలో మహ్మద్‌‌ నబీ, కరీమ్‌‌ జనత్‌‌ మంచి సమన్వయంతో ఆడారు. 17వ ఓవర్‌‌లో చెరో ఫోర్‌‌ కొడితే, తర్వాతి ఓవర్‌‌లో నబీ 6, 4తో 16 రన్స్​ రాబట్టాడు. 19వ ఓవర్‌‌లో షమీ.. నబీ, రషీద్‌‌ (0)ను ఔట్‌‌ చేయడంతో స్కోరు 127/7గా మారింది. లాస్ట్‌‌ ఓవర్‌‌లో 14 రన్సే వచ్చాయి.