ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్​... రైతన్నలపై టియర్​ గ్యాస్ ​ప్రయోగం

ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్​... రైతన్నలపై టియర్​ గ్యాస్ ​ప్రయోగం

పంటకు కనీస మద్దతు ధర కల్పించే రైతులు  కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.  దీంతో రైతన్నలు ఛలో ధిల్లీ  మార్చ్‌కు సన్నద్ధమయ్యారు. బారికేడ్లను దాటుకొని దిల్లీ దిశగా కదిలిన అన్నదాతలను చెదరగొట్టేందుకు హరియాణా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో పంజాబ్‌- హరియాణా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత నెలకొంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదేళ్ల కాంట్రాక్టును తిరస్కరించిన రైతులు.. బుధవారం  ( ఫిబ్రవరి 21) మరోమారు నిరసనలు చేపట్టారు. పార్లమెంట్ వద్ద  నిరసన తెలపాలని భావిస్తున్నారు.  రైతులను ఢిల్లీ బార్డర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే పెట్టిన ముళ్ల కంచెలు, బారికేడ్ల సాయంతో రైతులు ముందుకు రాకుండా అడ్డుపడుతున్నారు. ట్రాక్టర్ల సాయంతో బారికేడ్లను తొలగించేందుకు రైతులు ప్రయత్నించగా.. టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని, తమపై టియర్ గ్యాస్ ప్రయోగించారని రైతులు చెబుతున్నారు. శాంతియుత ప్రదర్శనకూ అనుమతివ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు.

ఢిల్లీ సరిహద్దు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు దేశ రాజధానికి తరలివెళుతున్నారు. దేశ రాజధానిలోకి ప్రవేశించాలనే రైతుల ప్లాన్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కాంక్రీట్‌తో గోడలు కట్టడం, కంచెలు వేయడం తెలిసిందే. అయితే వీటిని దాటుకుని వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వాటిని ధ్వంసం చేయాలని నిర్ణయించారు. బార్డర్ వద్ద బస్సులు, ట్రక్కులు, షిప్పింగ్ కంటైనర్‌లను బార్డర్స్ వద్ద ఉంచారు. జేసీబీలను తీసుకువచ్చారు. శాంతియుతంగా సాగుతున్న తమ నిరసనను అణిచివేయాలని చూడటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని, రైతులను చంపడం ద్వారా వారి సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వం భావిస్తే అలాగే చేయాలని, కానీ తాము మాత్రం శాంతియుతంగానే ముందుకు సాగుతామని రైతు నాయకుడు సర్వన్ సింగ్ తెలిపారు

బుల్‌డోజర్‌లు భద్రతకు ముప్పు కలిగిస్తున్నందున వాటిని స్వాధీనం చేసుకోవాలని హర్యానా పోలీసులు ... పంజాబ్‌ అధికారులను కోరారు. అన్ని పంటల ఎమ్మెస్పీకి చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రాబోయే ఐదేళ్లపాటు కొన్ని పంటలపై కేంద్రం అందించిన ఎంఎస్‌పీని  రైతులు తిరస్కరించారు. శంభు సరిహద్దులో 1200 ట్రాక్టర్లు, 300 కార్లతో పాటు దాదాపు 14,000 మంది రైతులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

ఇప్పటి వరకు జరిగిన  చర్చలలో ఐదేళ్ల కాంట్రాక్టుతో పప్పు ధాన్యాలు, పత్తి సహా పలు పంటలను కొనుగోలు చేస్తామని, ఈ బాధ్యతను సహకార సంఘాలకు అప్పగిస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు.  కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన అసంబద్ధంగా ఉందని, దీనికి తాము ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. తమ డిమాండ్లను సాధించుకునే వరకూ ఢిల్లీ బార్డర్ల నుంచి తిరిగి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. బార్డర్లలో నే ఉంటూ ఢిల్లీలోకి ఎంటరయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని చెప్పారు. మరింతమంది రైతులతో కలిసి ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఐదో రౌండ్ చర్చలకు రావాలంటూ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.