Farmers Protest: ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Farmers Protest: ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్

న్యూఢిల్లీ: కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో బుధవారం (ఫిబ్రవరి 21) ఢిల్లీ ఛలో మార్చ్ ను రైతులు తిరిగి ప్రారంభించారు. దీంతో ఢిల్లీ -ఎన్ సీఆర్ లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ -గురుగ్రామ్ సరిహద్దులో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. టిక్రీ, సింఘు,ఘాజీపూర్ సరిహద్దులో ఢిల్లీ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఢిల్లీ-ఎన్ సీఆర్ సరిహద్దుల్లోని పలు పాయింట్ల వద్ద భారీ బారీకేడింగ్ తో రోడ్లను మూసివేశారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోకి వెళ్లే వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు పంజాబ్ నుంచి నిరసన కారులు హర్యానా అంతర్రాష్ట్ర సరిహద్దులో మోహరించిన పోలీసు బారీకేడ్లను బద్దలు కొట్టడానికి బుల్డోజర్లు, ట్రాక్టర్లను తీసుకొచ్చారు. అప్రమత్తమైన హర్యానా పోలీసులు ప్రయత్నించారు. 

రైతులు ఎందుకు నిరసన కొనసాగిస్తున్నారు ? 

కేంద్రంతో జరిగిన నాలుగో దఫా చర్చలు విఫలం కావడంతో రైతులు తమ నిరసనను మళ్లీ ప్రారంభించారు. ఫిబ్రవరి 18 న కేంద్ర మంత్రులు, రైతు నేతల మధ్య జరిగిన నాలుగో రౌండ్ సమావేశంలో రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ఐదేళ్ల పాటు పప్పు ధాన్యాలు, మొక్క జొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది రైతులు ప్రయోజనం కలిగించేలా లేదని రైతుసంఘాలు తిరస్కరించాయి. కేంద్రం తో చర్చలు విఫలం కావడంతో తిరిగి తమ నిరసనను ప్రారంభిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. 

రైతుల డిమాండ్లు ఏంటీ.. 

పంటలకు కనీస మద్దతు ధరకి చట్టబద్దత, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, రైతులకు , రైతు కూలీలకు పింఛన్, రైతు రుణమాఫీ, విద్యుత్ ఛార్జీల పెంపు, పోలీసు కేసుల ఉపసం హరించి రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.దీంతో పాటు 2021 లఖింపూర్ ఖేరి హింసాకాండ బాధితులు, 2013 భూసేకరణ చట్టం పునరుద్దరణ, 2020-21  లో జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.