టార్గెట్ డిసెంబర్ 6.. 6 చోట్ల పేలుళ్లకు కుట్ర.. కదులుతున్న ఎర్రకోట బాంబు పేలుడు డొంక...

టార్గెట్ డిసెంబర్ 6.. 6 చోట్ల పేలుళ్లకు కుట్ర.. కదులుతున్న ఎర్రకోట బాంబు పేలుడు డొంక...
  • బాబ్రీ మసీద్ కూల్చివేతపై బద్లాకు జైషే ప్లాన్
  • ఢిల్లీ లక్ష్యంగా టెర్రరిస్ట్ మాడ్యూల్ బిగ్ స్కెచ్
  • ఐదు దశల్లో కార్యాచరణ అమలుకు ప్లాన్
  • నుహ్, గురుగ్రామ్ నుంచి కెమికల్స్ పర్చేజ్

ఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా బిగ్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుళ్ల కేసు విచారిస్తున్న దర్యాప్తు సంస్థ విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి.  బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన డిసెంబర్ 6 న ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఆరు చోట్ల ఒకేసారి సీరియల్ బ్లాస్టులు జరపాలని జైష్–ఇ–మహ్మద్ ఉగ్ర మాడ్యూల్ పథకం వేసినట్టు తేలింది. విచారణలో అరెస్టైన నిందితులు బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవడమే తమ లక్ష్యమని స్పష్టంగా ఒప్పుకున్నారని ఉన్నత స్థాయి గూఢచార వర్గాలు వెల్లడించాయి.

ఐదు దశల్లో ప్రణాళిక

వాళ్ల ప్రణాళిక ఐదు దశల్లో సాగింది. మొదట జైష్–ఇ–మహ్మద్, అంసార్ గజ్వాత్–ఉల్–హింద్ అనుబంధ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత హర్యానాలోని నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల నుంచి ఐఈడీల తయారీకి అవసరమైన రసాయనాలు, అమ్మోనియం నైట్రేట్, ఆయుధాలు సేకరించారు. మూడో దశలో ప్రాణాంతక కెమికల్ బాంబులు తయారు చేసి, లక్ష్య ప్రదేశాలను గుర్తించడం కూడా పూర్తయింది.  నాలుగో  దశలో సిద్ధమైన బాంబులను సభ్యులకు పంచి రహస్యంగా తరలించారు. చివరి దశలో డిసెంబర్ 6న ఢిల్లీ పరిధిలోని ఆరు నుంచి ఏడు ప్రదేశాల్లో ఒకేసారి పేలుళ్లు చేయాలని యోచించారు.  

అధికారుల ప్రకారం, మొదట ఈ దాడి ఆగస్టులో జరగాల్సి ఉన్నా, ఆపరేషనల్ లోపాలతో వాయిదా వేసి డిసెంబర్ 6నకి నిర్ణయించారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జైష్ నాయకుడు మసూద్ అజర్ పలు సందర్భాల్లో అయోధ్యపై దాడులు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉగ్ర మాడ్యూల్ రాజధానిపై పెద్ద ఎత్తున దాడి చేయాలనే ప్రణాళికతో పని చేస్తోంది. స్వాధీనం చేసిన పేలుడు పదార్థాలు, ఆయుధాలు ఆ దాడులకే సిద్ధం చేశారని తేలింది. సహచరులు అరెస్టయిన వార్త తెలిసిన తర్వాత భయంతో డాక్టర్ ఉమర్ తన కారులో ఉన్న బాంబును తానే పేల్చడంతో ఈ ఎర్రకోట పేలుడు జరిగినట్టు విచారణ తేల్చింది.


ప్రయాగ్ రాజ్, అయోధ్య  కూడా

అయోధ్య, ప్రయాగ్‌రాజ్ ను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎక్కువగా ప్రాణనష్టం కలిగించేందుకు మరియు దేశవ్యాప్తంగా భయానక పరిస్థితులు సృష్టించేందుకు ఒకేసారి ఎక్కువ చోట్ల పేలుళ్లను కార్యరూపంలో పెట్టాలని వారు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆయుధాలను, పేలుడు పదార్థాలను దాచడంతో పాటు రవాణాకు పాత, సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసి ఉపయోగించాలనుకున్నారు.  ఉదాహరణకు డ్రైవింగ్‌ లో ఉపయోగించిన ఐ20 కారుతో పాటు మరిన్ని వాహనాలను వారు సమకూర్చుకున్నట్టు సమాచారం. 

కుట్రల వేదిక 13వ నంబర్ గది

హర్యానాలోని ఫరీదాబాద్‌లో గల అల్‌-ఫలా యూనివర్సిటీని ఎన్ఐఏ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఇక్కడి మెడికల్‌ కాలేజీలోని బాయ్స్‌ హాస్టల్‌ ఉండే 17వ నంబరు భవనం వీరి ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందులో ముజమ్మిల్‌కు చెందిన 13వ నంబరు గదిలోనే ఉగ్ర కుట్రలకు పథక రచన చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యూనివర్సిటీ ల్యాబ్‌ నుంచి కొన్ని కెమికల్స్ తీసుకురావాలని ఉమర్‌, ముజమ్మిల్‌ ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. ఈ గదిలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని కెమికల్స్‌, డిజిటల్‌ పరికరాలు, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు.