రాజకీయాల్లోకి శశికళ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా?

రాజకీయాల్లోకి శశికళ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా?

మరోసారి తమిళనాడు పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. చిన్నమ్మ శశికళ పొలిటికల్ రీ ఎంట్రీపై ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె ఈ రోజు జయలలిత సమాధి దగ్గర నివాళులు అర్పించారు. జయలలిత సమాధి దగ్గరకు శశికళ సాదాసీదాగా కాకుండా.. భారీ అనుచరగణంతో వచ్చారు. జైలుకు వెళ్లినప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న చిన్నమ్మ అలియాస్ శశికళ.. త్వరలోనే పొలిటికల్‎గా రీఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ ఏడాది ఏప్రిల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంతకన్నా కొన్ని నెలల ముందే జైలు నుంచి శశికళ రిలీజ్ అయ్యారు. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగి చక్రం తిప్పాలనుకున్న ఆమె.. అనూహ్యంగా రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించారు. ఈ ఇష్యూ తమిళనాడుతో పాటు దేశం మొత్తం చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే.. మిత్రపక్షం బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. జయమరణం తర్వాత అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడింది. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత పాలిటిక్సిలో యాక్టివ్ అవ్వాలనుకున్నారు. మరోవైపు ఆమె మేనల్లుడు దినకరణ్ సొంత పార్టీ పెట్టుకున్నారు. అన్నాడీఎంకేలో శశికళ ఎంట్రీని చాలామంది నేతలు వ్యతిరేకించారు. అప్పటి సీఎం పళనిసామి, సీనియర్ నేత పన్నీర్ సెల్వం కూడా పార్టీలోకి శశికళను రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం జరిగింది. దీంతో ఆమె మేనల్లుడు దినకరణ్ పార్టీ తరపున పోటీ చేయాలని భావించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ... పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టు చిన్నమ్మ ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దల ఒత్తిళ్ల వల్లే.... శశికళ రాజకీయాల నుంచి తప్పుకున్నారనే వాదనా ఉంది. తాజాగా శశికళ యాక్టివిటీతో.. ఆమె వర్గం నేతలు, కార్యకర్తల్లో జోష్ వచ్చింది. అన్నాడీఎంకేలోని అసంతృప్తులు కూడా చిన్నమ్మ వైపుకు వస్తారనే ప్రచారం జరుగుతోంది.