లోను కావాలా? మేమిస్తం..

లోను కావాలా? మేమిస్తం..
  • డిజిటల్‌‌ లోన్‌‌ మార్కెట్‌‌పై  టెక్‌‌ కంపెనీల కన్ను
  •  మనదేశంలో ఈ మార్కెట్‌‌  విలువ భారీగా పెరుగుతోంది
  •  2023 నాటికి 350 బిలియన్‌‌ డాలర్లకు...

న్యూఢిల్లీ: డిజిటల్‌‌ లోన్‌‌ మార్కెట్‌‌లో అవకాశాలను దక్కించుకోవడానికి ఫేస్‌‌బుక్‌‌, షియోమీ వంటి బడా టెక్‌‌ కంపెనీలు బరిలోకి దిగాయి. ఈ సెగ్మెంట్లో తమ మార్కెట్‌‌వాటాను పెంచుకోవడానికి ప్లాన్లను రెడీ చేశాయి. ఇండియా డిజిటల్‌‌ లోన్‌‌ మార్కెట్‌‌ విలువ ఎన్నో వేల కోట్ల డాలర్లు కాబట్టి బిజినెస్ విస్తరణకు అపార అవకాశాలు ఉంటాయి. ఫేస్‌‌బుక్‌‌ కొన్ని రోజుల క్రితమే చిన్న బిజినెస్‌‌లకు లోన్లు ఇవ్వడాన్ని మొదలుపెట్టింది. ఇందుకోసం కొన్ని లెండింగ్‌‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. అర్హతను బట్టి రూ.ఐదు లక్షల వరకు, 17–20 శాతం వడ్డీతో లోన్లు ఇస్తుంది. చైనా కంపెనీ షావోమీ ‘మీ పే’ ద్వారా లోన్లు, క్రెడిట్‌‌కార్డులు, ఇన్సూరెన్సు ప్రొడక్టులు అమ్ముతోంది. ఇది కూడా బ్యాంకులతో ఫిన్‌‌టెక్‌‌ స్టార్టప్‌‌లతో ఒప్పందం చేసుకుంది. ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీ అమెజాన్ కొన్ని రోజుల క్రితమే వెల్త్‌‌ మేనేజ్‌‌ఎంట్‌‌ సెక్టార్‌‌లోకి అడుగుపెట్టింది. స్మాల్‌‌కేస్‌‌ టెక్నాలజీస్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ అనే ఫిన్‌‌టెక్‌‌ స్టార్టప్‌‌కు 40 మిలియన్ డాలర్లు సమకూర్చింది. ‘పే లేటర్‌‌’ విధానంలో కస్టమర్లకు రూ.10 వేల వరకు లోన్లు కూడా ఇస్తోంది. గూగుల్‌‌ డిజిటల్‌‌ గోల్డ్‌‌, మ్యూచువల్‌‌ ఫండ్స్‌‌, యూపీఐ వంటి సేవలు అందించడమే కాదు స్మాల్‌‌ ఫైనాన్స్‌‌ బ్యాంకులతో ఒప్పందం చేసుకొని వాటి కస్టమర్ల ఎఫ్‌‌డీలనూ తీసుకుంటోంది. అంటే గూగుల్‌‌ పే ద్వారా డిపాజిట్లు కూడా చేయొచ్చు. 


కరోనా వల్ల పెరిగిన డిమాండ్‌‌
కరోనా కారణంగా చాలా మంది ఆన్‌‌లైన్‌‌ సేవలను ఉపయోగించుకున్నారు. ఆన్‌‌లైన్‌‌ ట్రాన్సాక్షన్ల విలువ ప్రతి నెలా పెరుగుతూనే ఉంది. డిజిటల్‌‌ లోన్‌‌ మార్కెట్‌‌ విలువ 2023 నాటికి 350 బిలియన్‌‌ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు బిజినెస్‌‌ విలువ భారీగా పెరిగి ట్రిలియన్‌‌ డాలర్లకు చేరిందని బోస్టన్‌‌ కన్సల్టింగ్‌‌ గ్రూప్‌‌ వెల్లడించింది. యూపీఐ వంటి పేమెంట్‌‌ సేవలు అందించడం వల్ల ఫిన్‌‌టెక్‌‌ కంపెనీలకు నామమాత్రంగానే లాభాలు వస్తున్నాయని, యాప్‌‌ల ద్వారా  లోన్లు ఇస్తే మాత్రం భారీగా లాభాలు వస్తాయని బీసీజీ ఫైనాన్సియల్‌‌ ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌ ప్రాక్టీస్‌‌ ఎండీ, సీనియర్‌‌ పార్ట్‌‌నర్‌‌ సౌరభ్‌‌ త్రిపాఠీ అన్నారు. ఆన్‌‌లైన్‌‌లో లోన్లు తీసుకోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారని, అందుకే బడా ఫిన్‌‌టెక్‌‌ కంపెనీలు డిజిటల్‌‌ లోన్‌‌ మార్కెట్‌‌వైపు చూస్తున్నాయని వివరించారు. ఇండియా లోన్‌‌ మార్కెట్లో భారీగా అవకాశాలు ఉన్నాయన్న వాదన నిజమే అయినా, రిస్కులూ ఉన్నాయి. మన బ్యాంకులకు మొండిబకాయిల సమస్య ఎక్కువ. వచ్చే మార్చి నాటికి మొండి బాకీల రేషియో 11.3 శాతానికి పెంచుతాయని అంచనా. మొండిబాకీలు చాలా ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియాది రెండోస్థానం. కరోనా కారణంగా ఇవి మరింత పెరుగుతున్నాయి. ఫిన్‌‌టెక్‌‌ కంపెనీలు ఆన్‌‌లైన్‌‌లో లోన్లను సులువుగానే ఇస్తాయి కానీ వసూలు చేయడంలో మాత్రం ఇబ్బందులు తప్పవు. మనదేశంలో దాదాపు 300లకుపైగా స్టార్టప్‌‌లు ఆన్‌‌లైన్‌‌లో లోన్లు ఇస్తున్నాయి. వీటిని రెగ్యులేటరీ మెకానిజం పరిధిలోకి తేవడానికి ఆర్‌‌బీఐ ప్రయత్నాలను మొదలుపెట్టింది.