ముస్లిం రిజర్వేషన్లపై మోదీవి పచ్చి అబద్ధాలు: సిద్దరామయ్య

ముస్లిం రిజర్వేషన్లపై మోదీవి పచ్చి అబద్ధాలు: సిద్దరామయ్య

బెంగళూరు: బీసీలు, దళితుల రిజర్వేష్లనను కర్నాటకలో కాంగ్రెస్  ప్రభుత్వం ముస్లింలకు బదలాయించిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై సీఎం సిద్దరామయ్య తీవ్రంగా స్పందించారు. మోదీ చేసిన ఆరోపణల్లో నిజంలేదని ట్వీట్​ చేశారు. ‘‘బీసీలు, దళితుల రిజర్వేషన్లను మా ప్రభుత్వం ముస్లింలకు ట్రాన్స్ ఫర్  చేసిందని ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసలు అలాంటి ఆలోచనే మా పార్టీకి లేదు. మోదీ తన ఆరోపణలను నిరూపించాలి. లేకపోతే జాతికి క్షమాపణ చెప్పాలి. 

ఇప్పటి వరకూ ఏ ఇతర ప్రధాని కూడా ఆ పదవిని ఇంతగా దిగజార్చలేదు” అని సిద్దు విమర్శించారు. ఓటమి భయంతోనో, అజ్ఞానంతోనే మోదీ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ఎస్సీలు, ఎస్టీల రిజర్వేషన్లను ముస్లింలకు ఇస్తామని కాంగ్రెస్  ఎక్కడైనా చెప్పిందా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసిందా? అలా జరిగిందంటే ఆ వివరాలను దేశ ప్రజల ముందు ఉంచాలి” అని సిద్దు డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను పార్లమెంట్ ఆమోదం లేకుండా ఏకపక్షంగా అమలు చేయడం సాధ్యం కాదని, ఈ విషయం ప్రధానికి తెలియకపోవడం బాధాకరమని సిద్దు వ్యాఖ్యానించారు.