ఈకామర్స్ నుంచి క్లౌడ్ సేవల వరకు అనేక రంగాల్లోకి విస్తరించిన అమెరికా టెక్ దిగ్గడం అమెజాన్ 2022 తర్వాత అతిపెద్ద లేఆఫ్స్ దిశగా వెళుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇవాళ అంటే మంగళవారం నుంచి దాదాపు 30వేల మంది ఉద్యోగులను ఈ ప్లాన్ కింద ఇంటికి పంపే పనిలో కంపెనీ ఉన్నట్లు వెల్లడైంది. కరోనా సమయంలో ఉన్న పీక్ డిమాండ్ అవసరాల కోసం భారీగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్న కంపెనీ ప్రస్తుతం ఖర్చులను భారీగా తగ్గించుకునే క్రమంలో తొలగింపులకు కారణంగా తెలిసింది.
ప్రస్తుతం అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా 3లక్షల 50వేల మంది వరకు ఉద్యోగులను ఉండగా.. వారిలో 10 శాతం వరకు లేఆఫ్స్ కి గురికావచ్చని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. దీనికి ముందు గతంలో కంపెనీ 27వేల మందిని తొలగించిన సంగతి తెలిసిందే. గడచిన రెండేళ్లుగా కంపెనీ తన డివైజెస్, కమ్యూనికేషన్, పాడ్ క్యాస్టింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగులను తగ్గిస్తూ వచ్చింది. అలాగే హెచ్ఆర్, ఆపరేషన్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ రంగాలు కూడా కొంత తగ్గింపులను చూశాయి.
అయితే కంపెనీ సీఈవో కంపెనీలో స్ట్రక్చరల్ మార్పుల్లో భాగం మేనేజర్ స్థాయి ఉద్యోగులను తొలగించి పనిని మెరుగుపచనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది జూన్ మాసంలో మాట్లాడుతూ ఏఐ వినియోగం కారణంగా భవిష్యత్తులో ఉద్యోగుల కోతలు ఉంటాయని చెప్పిన తర్వాత ప్రస్తుత లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. రిపిటీటివ్ రొటీన్ పనులకు ఏఐ టూల్స్ వాడాలని కంపెనీ నిర్ణయించటం కూడా మరో కారణం.
నిపుణుల అంచనాల ప్రకారం అమెజాన్ తన భవిష్యత్తు ఏఐ ఇన్ ఫ్రా కోసం ప్రస్తుతం తాత్కాలికంగా ఒత్తిళ్లను ఎదుర్కొంటోందని, దీనిలో భాగంగానే తొలగింపులు కూడా వస్తున్నాయని అంటున్నారు. అమెజాన్ తన వర్క్ ఎఫీషియన్సీలను పెంచటంలో భాగంగా ఉద్యోగులను వారంలో 5 రోజులు ఆఫీసులకు తిరిగి రావాలని కోరింది. ఈ క్రమంలో పెద్దగా ఉద్యోగులు రాజీనామాలు కూడా చేయకపోవటంతో ప్రస్తుతం లేఆఫ్స్ సైజ్ పెద్దదిగా ఉన్నట్లు అంతర్గతంగా విషయం తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు.
కార్పొరేట్ ఆఫీసులకు దూరంగా నివసిస్తున్నందున లేదా ఇతర కారణాల వల్ల రోజూ ఆఫీసులకు రాని కొంతమంది ఉద్యోగులకు, వారు స్వచ్ఛందంగా అమెజాన్‌ను విడిచిపెట్టారని, వారికి కంపెనీ సివరెన్స్ పేమెంట్ లేకుండా వెళ్లిపోవాలని చెబుతున్నట్లు తెలిసింది. మెుత్తానికి కంపెనీ భారీగానే ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికతో ముందుకు సాగుతోందని వెల్లడైంది.
