సతాయిస్తున్న భూ భారతి పోర్టల్..తరచూ టెక్నికల్ ఇష్యూస్ 

సతాయిస్తున్న భూ భారతి పోర్టల్..తరచూ టెక్నికల్ ఇష్యూస్ 
  • సెలవులో రెవెన్యూ సెక్రటరీ లోకేశ్ కుమార్​ 
  • ఇటీవల సీసీఎల్ఏ సెక్రటరీ మకరంద్ బదిలీ 
  • ఆయన స్థానంలో ఎవరినీ నియమించలే
  • పేరుకుపోతున్న సమస్యలు.. ఇంటిగ్రేటెడ్ పోర్టల్ పైనా రివ్యూ చేస్తలే 

హైదరాబాద్, వెలుగు:  భూ భారతి పోర్టల్ తరుచూ సతాయిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపంతో ఈ పోర్టల్ గందరగోళానికి కేరాఫ్ అడ్రస్‌‌గా మారింది. ఏ పని కావాలన్నా సాంకేతిక సమస్యల సాకుతో రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తేస్తోంది.  రెవెన్యూ శాఖలో కీలక అధికారుల వరుస సెలవులు, బదిలీలతో శాఖ మొత్తం స్తంభించింది. కీలకమైన రెవెన్యూ సెక్రటరీ లోకేశ్ కుమార్ సెలవులో వెళ్లగా ఆ స్థానంలో ఎవరికీ బాధ్యతలు ఇవ్వలేదు.

మరోవైపు సీసీఎల్ఏ సెక్రటరీగా పనిచేసిన మకరంద్ బదిలీ తర్వాత ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. కీలకమైన పోస్టుల్లో అధికారులు లేకపోవడంతో కింది స్థాయి సిబ్బందికి మార్గదర్శకత్వం చేసేవారు కరువయ్యారు. దీంతో భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో తమ సమస్యలు తీరడం లేదని సీసీఎల్ఏకు వస్తున్న రైతులను పట్టించుకునే వారు కరువయ్యారు.  

సమీక్షలు లేక.. ఐదు మండలాల్లో సమస్యలు..

ఇంటిగ్రేటెడ్ పోర్టల్, సర్వే మ్యాప్‌‌ల మధ్య పొంతన లేకపోవడంతో ఐదు మండలాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొత్త సర్వే మ్యాపులు అప్‌‌లోడ్ చేయకపోవడం వల్ల భూముల సరిహద్దుల విషయంలో రైతుల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. అటు రెవెన్యూ సెక్రటరీ, ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో నెలకొన్న ఈ ఇబ్బందులపై రివ్యూ చేయడం లేదు.  జిల్లా స్థాయి అధికారులు కనీసం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించకపోవడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సర్వే మ్యాపులు అప్‌‌డేట్ కాకపోవడంతో పట్టా భూములు, ప్రభుత్వ భూముల మధ్య తేడాలు తెలియక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. పోర్టల్‌‌లో చూపిస్తున్న విస్తీర్ణం, వాస్తవంగా భూమి విస్తీర్ణం భిన్నంగా ఉండటంతో గందరగోళం తారాస్థాయికి చేరింది. వెంటనే ఈ మండలాలు, సర్వే మ్యాపుల సమస్యపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, తక్షణమే పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేదంటే ఆయా ప్రాంతాల్లో భూ వివాదాలు మరింత ముదిరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

పేరుకుపోతున్న దరఖాస్తులు..

రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తులు పేరుకుపోతుండగా, సాదా బైనామా దరఖాస్తుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సాదా బైనామా దరఖాస్తు చేసుకున్న రైతులు, ఇప్పటికీ పట్టాదారు పాసుపుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. సర్వర్‌‌లోని సాంకేతిక లోపాలు, అధికారుల నిర్లిప్తత కారణంగా ఈ దరఖాస్తులు పెండింగ్‌‌లోనే ఉండిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాకపోవడంతో పేద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూమి రిజిస్ట్రేషన్ లేదా మ్యుటేషన్ కావాలన్నా, ఈ సాదా బైనామా సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయని బాధితులు వాపోతున్నారు.