యూపీలోని పలు ప్రధాన నగరాల శివారుల్లో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. గ్రేటర్ నోయిడాలో కోతి పేరు చెబితే వణికిపోతున్నారు స్థానికులు. పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లేటప్పుడు... కోతులు దాడి చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. వీధుల్లోనూ వెళ్లాలన్నా.. వెంటపడి మరీ దాడి చేస్తున్నాయి కోతులు. గ్రేటర్ నోయిడాలోని పలు కాలనీల్లో పదికి పైగా కోతులు గుంపులుగా తిరుగుతూ హడలెత్తిస్తున్నాయి. అపార్టుమెంట్ ల బాల్కనీల్లో కోతులు వేలాడుతూ.. ఇళ్లపైనుంచి దూకుతూ... హల్చల్ చేస్తున్నాయి. సెక్టార్ బీటా 1 ఏరియాలో ఈ వారంలో రెండు ఇళ్లలోకి వెళ్లి మరీ జనాలను కోతులు కరవడంతో.. నలుగురు మహిళలు గాయపడ్డారు. హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. స్కూళ్లకు పిల్లలను తీసుకుని పోవడానికి మహిళలు భయపడిపోతున్నారు. కోతుల భయంతో ఇళ్లనుంచి బయటకు రావడానికే గజగజా వణికిపోతున్నారు. గుంపులు గుంపులుగా వస్తుండటంతో.. జనాలకు వాటిని చూసి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీకి స్థానికులు కంప్లయింట్ కూడా చేశారు. కోతులను పట్టేవాళ్లను కాలనీల్లో మోహరించాలని.. వాటినుంచి తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు.
కోతులు తరమడంతో టెర్రస్ పైనుంచి కిందపడి బాలుడు మృతి
కాస్గంజ్ , ఆగ్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ నెలరోజుల్లో కోతుల దాడిలో ఐదుగురు చిన్నపిల్లలు, విద్యార్థులు చనిపోయారు. సోమవారం నాడు జరిగిన దారుణం పరిస్థితిని కళ్లకు కడుతోంది. జోహ్రావోరా ప్రాంతంలో ఓ అపార్టుమెంట్ బాల్కనీలో ఆడుకుంటున్న తొమ్మిదో తరగతి విద్యార్థి నమన్ జైన్ ను కోతులు బెదిరిస్తూ తరిమాయి. కోతి నుంచి తప్పించుకునేందుకు బాలుడు పరుగెడుతూ టెర్రస్ పైనుంచి కిందపడి దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు.
