బిర్యానీకి 500.. బీర్లకు 5000

బిర్యానీకి 500.. బీర్లకు 5000

ఇంకొన్ని గంటలల్ల నయా సాల్ వస్తది. ఇట్లాంటి ఇంపార్టెంట్ టైంల కొందరు స్టూడెంట్లు, యూత్ ను తీన్మార్ చంద్రవ్వ పలకరించింది. తనదైన శైలిలో సరదాగా ప్రశ్నలు వేసి.. వాళ్ల దిల్ ల ఉన్న మాటలను రాబట్టింది. నయా సాల్ సెలబ్రేషన్స్ ఎట్ల చేస్కుంటరు దగ్గరి నుంచి మొదలుపెడితే సెలబ్రేషన్స్ కు ఎంత ఖర్చయితది అనే దాకా రకరకాల ప్రశ్నలను చంద్రవ్వ అడిగింది. దీనికి విద్యార్థులు కూడా  సూటిగా, సుత్తి లేకుండా సమాధానాలు ఇచ్చిండ్రు. చంద్రవ్వ,  విద్యార్థుల మధ్య సరదా సంభాషణ ఇట్ల సాగింది.. 

ఇయ్యాల రాత్రి దావత్ ఎక్కడ

చంద్రవ్వ : ఇయ్యాల రాత్రి దావత్ ఎక్కడ చేస్కుంటరు ? 

విద్యార్థినులు : దోస్తుల ఇంటికిపోయి దావత్ చేస్కుంటం. అక్కడే నైట్ అవుట్ చేస్తం.  

చంద్రవ్వ :  ఇంకా ఏం చేస్తరు ? 

విద్యార్థినులు  : కేక్ కట్ చేస్తం.. డ్యా్న్సులు చేస్తం. చికెన్ బిర్యానీ, చికెన్ 65, పిజ్జా అన్నీ తెచ్చుకొని దావత్ చేస్కుంటం.

పబ్ లో ఏముంటది పప్పన్నమా 

చంద్రవ్వ : ఇయ్యాల రాత్రి ఎక్కడికి పోతరు ?

యువకులు  : పబ్ కు పోదామని అనుకుంటున్నం

చంద్రవ్వ : ఏముంటది ఆడ పప్పన్నమా ? 

యువకులు : పబ్ అంటే అక్కడ చిల్ అవుతం.. డ్యాన్స్ చేస్తం

చంద్రవ్వ : పబ్ ల ఎంత ఖర్చు వస్తది ?

యువకులు : లైట్లు తక్కువుంటయి కాబట్టి తక్కువ ఖర్చే వస్తది

దావత్ చేస్కోవా..?

చంద్రవ్వ : ఇయ్యాల రాత్రి ఎక్కడుంటవ్ 

విద్యార్థిని : ఇంట్లనే ఉంట 

చంద్రవ్వ :  దావత్ చేస్కోవా.. 

విద్యార్థిని : లేదు

చికెన్, మటన్ అన్ని తింటరా..?

చంద్రవ్వ : ఇయ్యాల రాత్రికి మీ ఇంట్ల చికెన్, మటన్ అన్ని తింటరా.. 

విద్యార్థిని : మేం వెజిటేరియన్స్.. కేక్ కట్ చేసుకొని తింటం అంతే

ఎట్ల సెలబ్రేట్ చేస్కుంటరు ?

చంద్రవ్వ : మీరు న్యూ ఇయర్ ఎట్ల సెలబ్రేట్ చేస్కుంటరు ? 

విద్యార్థిని  :  మా ఫ్యామిలీల అందరం కలిసి పార్టీ చేస్కుంటం

చంద్రవ్వ : ఎవల ఇంట్ల పార్టీ చేస్తే వాళ్లదేనా ఖర్సు ?

విద్యార్థిని : అట్ల కాదు.. ఒకరు లైట్ల ఖర్సు.. ఒకరు మ్యూజిక్ ఖర్సు.. ఒకరు కేక్ ఖర్సు.. ఒకరు బిర్యానీ ఖర్సు.. ఇట్ల ఖర్సులన్ని పంచుకుంటం

చంద్రవ్వ : పెద్ద కుటుంబం ఉంటే.. గిట్ల పెద్ద లాభముంటది !! నెత్తికొక్కరు ఖర్సును పంచుకుంటరు..

తాగి ఊరంత తిరుగుతర

చంద్రవ్వ : రాత్రి ఏమేం తింటరు 

విద్యార్థి : ఇంట్లో బిర్యానీ చేసుకొని తింటం.. తాగుతం

చంద్రవ్వ : తాగి ఊరంత తిరుగుతర

విద్యార్థి : తాగి తిరిగితే అంతే సంగతి పోలీసులు పట్టుకుంటరు. హెల్మెట్ లేదని మొన్ననే 300 ఫైన్ ఏసిండ్రు

చంద్రవ్వ : ఇయ్యాల దావత్ కు ఎంత ఖర్సయితది

విద్యార్థి : బీర్లకు 5000.. బిర్యానీకి 500 ఖర్చయితది
 

పవన్ కళ్యాణ్ ఖుషీ సిన్మా ప్రీ రిలీజ్ ఉంది

చంద్రవ్వ : ఇయ్యాల రాత్రి ఏం చేస్తాన్నవ్

విద్యార్థిని : పవన్ కళ్యాణ్ ఖుషీ సిన్మా ప్రీ రిలీజ్ ఉంది. దానికి పోవాలె.. సిన్మా సూడాలె.. 

చంద్రవ్వ :  నువ్వు టికెట్ పెట్కో.. ఇంటర్ వెల్ ల నేను నీకు సమోస తినిపిస్త

విద్యార్థిని : సరే  (నవ్వుతూ)