తహసీల్దార్లే సుప్రీం..భూపరిపాలన మొత్తం ఎమ్మార్వో ఆఫీసుల్లోనే..

తహసీల్దార్లే సుప్రీం..భూపరిపాలన మొత్తం ఎమ్మార్వో ఆఫీసుల్లోనే..
  • భూపరిపాలన మొత్తం ఎమ్మార్వో ఆఫీసుల్లోనే..
  • నాలా కన్వర్షన్​ పవర్స్ ​ఆర్డీవోల నుంచి తహసీల్దార్లకు..
  • పదవులు పెద్దవైనా అధికారాల్లేవని అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోల ఆవేదన

హైదరాబాద్, వెలుగురాష్ట్ర భూపరిపాలనలో తహసీల్దార్లే సుప్రీంగా మారిపోయారు. కొత్త చట్టంతో వీఆర్వోలను తొలగించటం, తాజా చట్ట సవరణతో ఆర్డీవోలు, జాయింట్​ కలెక్టర్ల అధికారాలను కట్​ చేసి తహసీల్దార్లకు అప్పగించటంతో.. మండలాల్లో తహసీల్దారే అన్నీ తానై అన్నట్టుగా వ్యవహరించనున్నారు. కొత్త చట్టాలతో తెచ్చిన మార్పులతో రాష్ట్ర సర్కారు భూరికార్డుల నిర్వహణను మొత్తంగా తహసీల్దార్లకే కట్టబెట్టింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, పాస్​ బుక్స్​ జారీ, అగ్రికల్చర్​ ల్యాండ్స్​ను నాన్​ అగ్రికల్చర్​ ల్యాండ్స్ గా మార్చే పవర్స్​ను వారికే అప్పగించింది. తహసీల్దార్లపై పర్యవేక్షణాధికారులుగా ఉన్న ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లు తమ పదవులు పెద్దవైనా అధికారాల్లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చే అధికారాన్ని రాష్ట్ర సర్కారు తహసీల్దార్లకు అప్పగించింది. నాలా కన్వర్షన్​గా పేర్కొనే ఈ పవర్​ గతంలో రెవెన్యూ డివిజనల్​అధికారి (ఆర్డీవో) చేతుల్లో ఉండేది. నాలా కన్వర్షన్​లో ఆర్డీవో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో.. వారి పవర్​ కట్​ చేసి తహసీల్దార్లకు అప్పగించారని తెలిసింది. ఇక ముందు ఎవరైనా తమ భూములను అగ్రికల్చర్​ ల్యాండ్​ జాబితా నుంచి నాన్​ అగ్రికల్చర్​ ల్యాండ్​ జాబితాలోకి మార్చుకోవాలంటే.. ముందు ధరణి వెబ్​సైట్​ ద్వారానే ఆన్​లైన్​లో తహసీల్దార్​కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాంటి అనుమతుల్లేకుండా నాన్​ అగ్రికల్చర్​ ల్యాండ్​గా వినియోగిస్తే.. కన్వర్షన్​ ట్యాక్స్​తోపాటు మరో 50 శాతం మొత్తాన్ని ఫైన్​గా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించగానే ఆర్వోఆర్​ రికార్డుల్లోని ల్యాండ్​ను నాన్​అగ్రికల్చర్​ ల్యాండ్​ గా మార్చేసి.. వ్యవసాయ భూముల జాబితా నుంచి తొలగిస్తారు. వివరాలను నాన్​ అగ్రికల్చర్​ధరణి పోర్టల్ లో చేర్చి.. ఆ భూమికి మెరూన్​ కలర్​ పాస్​ బుక్​జారీ చేస్తారు.

పదవులు పెద్దవాయే.. పవర్‌‌ లేదాయే

కొత్త రెవెన్యూ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాక రెవెన్యూ అధికారుల్లో అంతర్మథనం మొదలైంది. ఇన్నాళ్లు రెవెన్యూ శాఖలో కీలకంగా ఉన్న వీఆర్వోలు, ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్ల అధికారాల్లో ప్రభుత్వం కోత విధించడంతో.. ల్యాండ్​ అడ్మినిస్ట్రేషన్​లో వారి పాత్ర నామమాత్రంగా మారింది. రెవెన్యూ కోర్టుల రద్దుతో భూవివాదాలను పరిష్కరించే అధికారం ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లకు లేకుండా పోయింది. తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని భూవివాదాలు, తహసీల్దార్​ కోర్టు ఇచ్చిన తీర్పులపై ప్రజలు ఆర్డీవోకు అప్పీల్  చేసేవారు. ఇప్పుడా చాన్స్​ లేదు. తాజాగా నాలా కన్వర్షన్​ పవర్​  తప్పించేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.