
హైదరాబాద్, వెలుగు: మూడేళ్ళలో రోడ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రోడ్ల మరమ్మతులతోపాటు కొత్త వంతెనల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రూ.2,492 కోట్లతో 516 వంతెనల నిర్మాణ పనులను రోడ్లు భవనాల శాఖ చేపట్టింది. వీటిలో వేములవాడ, భద్రాచలం పర్ణశాల దగ్గర నిర్మిస్తున్న వంతెనలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లోనూ వంతెనల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గోదావరి నదిపై వినియోగంలో ఉన్న వంతెనలు మొత్తం 11 కాగా, మూడు వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. మరో నాలుగు ప్రతిపాదన దశలో ఉన్నాయి.
మానేరుపై నిర్మించనున్న రెండు సస్పెన్షన్ వంతెనల పనులకు టెండర్లు పూర్తయినట్లు అధికారులు చెప్పారు. ఏటూరునాగారం, రాయపట్నం వద్ద వంతెనల నిర్మాణం పూర్తయ్యింది. భద్రాచలం, కాళేశ్వరం, బాసర, తుపాకులగూడెం వద్ద వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో మఠంపల్లి, సోమశిల దగ్గర వంతెనలు నిర్మాణ దశలో ఉన్నాయి. వంతెనలతోపాటే రోడ్లు భవనాల శాఖ 204 చెక్ డ్యామ్ ల నిర్మాణం బాధ్యతలు చేపట్టింది. ఇప్పటికే రూ.647.84 కోట్లతో 198 చెక్ డ్యామ్ ల నిర్మాణం జరుగుతోంది. అదిలాబాద్ -63 , మెదక్ 39, ఖమ్మం 34, వరంగల్ 15, మహబూబ్ నగర్, నిజామాబాద్, రంగారెడ్ డి జిల్లాల్లో 11 చొప్పున, కరీంనగర్ -9, నల్లగొండలో- 5 చెక్ డ్యామ్ ల పనులు జరుగుతున్నాయి. వీటిలో చాలావరకు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.