కనీస వేతనాల అమలులో  తెలంగాణ రోల్ మోడల్..మన పాలసీకి ఐఎల్ వో ప్రశంసలు: అసెంబ్లీలో మంత్రి వివేక్ వెంకటస్వామి

కనీస వేతనాల అమలులో  తెలంగాణ రోల్ మోడల్..మన పాలసీకి  ఐఎల్ వో ప్రశంసలు: అసెంబ్లీలో మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు యోచనలో ఉన్నాం
  • రాష్ట్రంలో 1.10 కోట్ల కార్మికులు.. వాళ్ల ఆర్థిక స్థితి మెరుగు పర్చడమే లక్ష్యమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో అమలుచేస్తున్న కనీస వేతనాల విధానాన్ని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్​వో) ప్రశంసించిందని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. కనీస వేతనాల అమలులో దేశంలోని ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం రోల్ మోడల్‌‌‌‌గా నిలిచిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ తరహాలో కనీస వేతనాల విధానాన్ని అమలు చేయాలని ఐఎల్​వో సూచించిందన్నారు.

కార్మికులకు న్యాయమైన వేతనాలు, మెరుగైన ఆర్థిక భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో కార్మికుల సంక్షేమం, కనీస వేతనాలపై ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రంగారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి వివేక్ వెంకటస్వామి సమాధానమిచ్చారు. 

కార్మికుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకే

రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు, సంస్థల్లో పనిచేస్తున్న 1.10 కోట్లకు పైగా కార్మికుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను సవరించి అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సవరించిన కనీస వేతనాలు అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. “కనీస వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు నాతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబుతో కలిపి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశాం.

పరిశ్రమలు, కార్మిక సంఘాలు, ఇతర వర్గాలతో విస్తృతంగా చర్చించి కనీస వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నాం. వేతనాలు పెంచితే పరిశ్రమలపై ప్రభావం పడుతుందని సీఐఐ, ఫ్యాప్సీ ప్రతినిధులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. కార్మికుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని వారికి స్పష్టం చేశాం. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కార్మికుల కనీస వేతనాల పెంపుపై తగిన శ్రద్ధ చూపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి, అన్ని వర్గాలతో చర్చించి కనీస వేతనాలను సవరించాం’ అని మంత్రి వివేక్ వెల్లడించారు.

ఔట్​సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. సభ్యుల సూచనల మేరకు త్వరలో సమావేశం నిర్వహించి కార్పొరేషన్ ఏర్పాటుపై చర్చిస్తామని చెప్పారు. అహ్మద్ నదీమ్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఉన్న కమిటీ సిఫార్సుల ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికుల సమస్యలు, యూనియన్ ఎన్నికల అంశంపై కోర్టు నిర్ణయం వచ్చే వరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు.

ఈ సమస్యపై మరోసారి న్యాయవాదులతో చర్చిస్తామన్నారు. కార్మికులకు సంబంధించిన నిర్దిష్ట సమస్యలను సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. 

ఎన్టీపీసీ, సింగరేణి సంస్థల్లోనూ అమలుకు చర్యలు

ఎన్టీపీసీ, సింగరేణి తదితర సంస్థల్లోనూ కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. రామగుండం మున్సిపాలిటీ, ఎన్టీపీసీ కేటగిరీకి సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని ఇప్పటికే పలుమార్లు విద్యుత్ శాఖతో  చర్చించినట్టు చెప్పారు.

మరోసారి సంబంధిత శాఖతో చర్చించి, అవసరమైతే కమిటీ ఏర్పాటు చేసి విధివిధానాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామ పంచాయతీల్లోనూ కనీస వేతనాల అమలుపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. మున్సిపల్ కార్మికులకు ఇప్పటికే కనీస వేతనం కంటే ఎక్కువ వేతనం అందుతున్న చోట తగ్గించమని మంత్రి స్పష్టం చేశారు.