- అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తం: మంత్రి పొంగులేటి
- యుద్ధ ప్రాతిపదికన దరఖాస్తులు పరిష్కరించాలి
- ఆన్‌లైన్‌లో ఉన్న వివరాల ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలి
- రెవెన్యూ శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: నిషేధిత ఆస్తుల 22ఎ (పీఓబీ) జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం సచివాలయంలో 22ఎ అంశంపై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో మంత్రి సమీక్షించారు. 22ఎకు సంబంధించి ప్రజావాణితో పాటు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు, సబ్ రిజిస్ట్రార్లకు జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు.. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమస్య వచ్చినప్పుడు పరిష్కరించేదానికన్నా సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. ‘పీఓబీ దరఖాస్తులకు సంబంధించి కేస్‌బై కేస్ ప్రతి రోజూ సమీక్షించాలి. 22ఎ పేరిట ఉద్దేశపూర్వకంగా పేదోడికి, అర్హులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేదిలేదు.
అర్బన్ సీలింగ్ ల్యాండ్, సర్ప్లస్ ల్యాండ్స్, వివిధ సందర్భాలలో ప్రభుత్వ భూముల రెగ్యులరైజ్‌కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లే-అవుట్ల అనుమతులు తదితర వివరాలతో కూడిన అన్ని డాక్యుమెంట్లను ఈ నెల 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి’అని అధికారులను ఆదేశించారు. దీంతో ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టవచ్చని రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్‌లకు స్పష్టత వస్తుందని, ఏది బోగస్ డాక్యుమెంట్, ఏది నిజమైన డాక్యుమెంట్ అనేదానిపై సూపర్ చెక్ చేసుకోవడానికి వీలుకలుగుతుందన్నారు. మరింత పారదర్శకత కోసం పహానీలు కూడా సబ్ రిజిస్ట్రార్‌కు యాక్సెస్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్లో ఏది జెన్యూన్.. ఏది కాదు గుర్తించి జెన్యూన్ ఉన్నవాటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీలేదు..
సబ్ రిజిస్ట్రార్లకు విచక్షణాధికారాలు ఉండకూడదని, అదనపు అధికారాలు వద్దని, ఆన్‌లైన్‌లో ఏది ఉంటే దానికి ఆమోదం తెలిపేవరకే వారి అధికారాలను పరిమితం చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తేలేదన్నారు. ఏ చిన్న తప్పుచేసినా క్షమించేదిలేదని, కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఏదైనా సమస్య ఉంటే జిల్లా సబ్ రిజిస్ట్రార్‌లు కలెక్టర్ దృష్టికిగాని ఐజీ దృష్టికి గాని తీసుకురావాలని, పీఓబీ జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్‌లను గుడ్డిగా తిరస్కరించకుండా మూడు రోజుల సమయం తీసుకొని ఎందుకు తిరస్కరించవలసి వస్తుందన్న వివరాలను తెలియజేయాలన్నారు. పీఓబీకి సంబంధించి వచ్చిన ప్రతి దరఖాస్తును ఇకనుంచి తహసీల్దార్‌కు పంపకుండా నేరుగా కలెక్టర్‌కే పంపించాలన్నారు. కలెక్టర్ నుంచి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ నుంచి కలెక్టర్ మధ్యనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలన్నారు. గతంలో నాన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్, పీఓబీ జాబితాలు వేర్వేరుగా ఉండేవన్నారు. వీటిని సమీకృతం చేయడం వలన సబ్ రిజిస్ట్రార్ పరిశీలనలో కొన్ని ఆస్తులు, నిషేధిత జాబితాలో ఉన్నట్టు కనిపిస్తున్నందున మొత్తం రిజిస్ట్రేషన్ ఆపుతున్నారని ఫిర్యాదుల వస్తున్నాయన్నారు.
