న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో గ్రామీణ కుటుంబాలకు 100 శాతం నల్ల నీళ్లు అందుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి వి. సోమన్న రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం ఇళ్లకు నల్లా కనెక్షన్లు పూర్తి అయినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 53,98,219 గ్రామీణ కుటుంబాలకూ నల్లా కనెక్షన్లు పూర్తి అయ్యాయని, ఎక్కడా పెండింగ్ ఇళ్లు లేవని సమాధానంలో పొందుపరిచారు. అయితే... జాతీయ స్థాయిలో ఈ కనెక్షన్ల విషయంలో కాస్త వెనుకబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా 19.35 కోట్ల గ్రామీణ ఇళ్లలో 15.89 కోట్ల ఇళ్లకు కనెక్షన్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు.
