ఉద్యమకారులను గుర్తించేందుకు ..జూన్ 23 నుంచి  సంప్రదింపులు

ఉద్యమకారులను గుర్తించేందుకు ..జూన్ 23 నుంచి  సంప్రదింపులు

హైదరాబాద్, వెలుగు: ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతి కేంద్రంగా వివిధ వర్గాలతో సంప్రదింపులు నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది. ఇందులో విద్యార్థి జేఏసీ ప్రతినిధులు, కళాకారులు, రచయితలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అడ్వకేట్లు, డాక్టర్స్ తదితర వర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతిని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మంగళవారం సందర్శించారు.

ఈ సందర్భంగా అమరజ్యోతి ప్రాంగణంలో నిర్మించిన వివిధ గదులను పరిశీలించిన కమిటీ సభ్యులు, ప్రత్యేకంగా ఆడియో-విజువల్ రూమ్‌‌ను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కమిటీ చైర్మన్ కే. కేశవరావు నేతృత్వంలో అమరజ్యోతి కేంద్రంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించారు. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ప్రజా సంఘాల ఉద్యమకారులు, ఉద్యమకారుల సంక్షేమ కమిటీలు, ఇతర వర్గాలతో రాజకీయాలకు అతీతంగా విస్తృత స్థాయిలో చర్చలు జరిపి ఉద్యమకారుల గుర్తింపునకు అవసరమైన సూచనలు, సలహాలను దశలవారీగా సేకరించాలని కమిటీ నిర్ణయించింది.

ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్‌‌లైన్, ఆఫ్‌‌లైన్ విధానాల్లో సూచనలు స్వీకరించనున్నారు. ఆన్‌‌లైన్ విధానంలో ప్రత్యేక వెబ్‌‌సైట్‌‌ను ఏర్పాటు చేయడంతో పాటు, ఆఫ్‌‌లైన్ విధానంలో ఉద్యమకారులు తమ ప్రాతినిధ్యాలు సమర్పించేందుకు ప్రత్యేక అధికారులను నియమించి, అందిన అభిప్రాయాలు, వివరాలను నమోదు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో  మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు