అన్నదాత ఉసురు ఉట్టిగా పోదు

అన్నదాత ఉసురు ఉట్టిగా పోదు
  • వడ్లు కొనాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డిమాండ్

హైదరాబాద్‌: తాము కష్టం చేసి దేశానికి అన్నం పెట్టే రైతులను గోస పెట్టినవాళ్లు శాశ్వతంగా అధికారానికి దూరమవుతారని, గత అనుభవాలను చూస్తే ఎవరికైనా ఇది అర్థమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అన్నదాతల ఉసురు ఉట్టిగా పోదని ఆయన హెచ్చరించారు. యాసంగి వడ్ల కొనుగోలు విధానంపై కొద్ది రోజులుగా నడుస్తున్న రాజకీయ రగడపై ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులును ఇబ్బంది పెట్టడం ఎవరికీ మంచిది కాదని అన్నారు. దివాళా కోరు విధానాలను పక్కనపెట్టి రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిరంజన్ రెడ్డి కోరారు. వడ్ల కొనుగోలుపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక విధానం ప్రకటించి, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ నేతలు దానికి భిన్నంగా ప్రకటనలు చేయడం ఏంటన్నారు. ఇప్పటికే ఉత్తర భారతం రైతుల నిరసనలతో అట్టుడికిపోతోందని, ఇటీవల సుప్రీం కోర్టు తీర్పుతో కొద్ది రోజులుగా వాళ్లు నిరసనలు విరమించినా, కేంద్రం తెచ్చిన చట్టాల ఇంకా మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉన్నాయని నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో రైతులంతా కేంద్రం తెచ్చిన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగానే ఉన్నారని గుర్తించాలని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాల విషయంలో సమీక్ష చేసుకోవాలని సూచించారు.

ఉన్న ధాన్యం పెద్దలకు పంచేసి.. ఇప్పటివి కొనుగోలు చేయండి

రైతులతో పెట్టుకోవద్దని, వాళ్ల విషయంలో మరీ కఠినంగా వ్యవహరించడం మంచిది కాదని వ్యవసాయ శాఖ మంత్రి నిరసంజన్ రెడ్డి అన్నారు. రైతులు పండించిన పంట కొనుగోలు చేయాలని, దీనికి అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కేంద్రానికి సూచించారు. ఇప్పటికీ దేశంలో కోట్లాది మంది నిరు పేదలు తిండి గింజలు లేక పస్తులు ఉంటున్నారని, అలాంటి వారికి ఎఫ్‌సీఐ గోడౌన్లలో ఉన్న ధాన్యం పంచి పెట్టి, కొత్తగా పండించే వడ్లను కొనుగోలు చేయాలని కోరారు. అలా కాకుండా నిల్వ ఉన్న ధాన్యాన్ని ఎలుకలు, పందికొక్కులకు పెడితే ఏం వస్తుందని ప్రశ్నించారు. కేంద్రం కొనుగోలు చేయకుండా, కనీసం విదేశాలకు ఎగుమతి చేయనీయకుండా అడ్డుపడడం తగదని అన్నారు. 

పంట మార్పిడిని మేమే సూచించాం

దేశంలో కార్పొరేట్లు ఎగ్గొట్టిన అప్పులను రూ.6 లక్షల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందని, మరి రైతుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కేవలం కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదరా అని మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రశ్నించారు. రైతులకు అండగా నిలవలేని వాళ్లు.. దేశ ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు ఎలా ధారాదత్తం చేస్తారని ఆయన నిలదీశారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాలాన్ని బట్టి డిమాండ్ ఉన్న పంటలు వేయాలన్ని విషయంలో తామూ అంగీకరిస్తామని, ఉద్యానవన పంటలు, నూనె గింజల ఉత్పత్తి పెంచాలని 
కేంద్రం కన్నా ముందు తామే ప్రతిపాదించామని ఆయన చెప్పారు.