రాష్ట్రంలో 2045 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులు

రాష్ట్రంలో 2045 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులు
  •  తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ రెడీ చేసిన ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు: 2045 నాటికి రాష్ట్రంలోని ప్రతి పల్లెకు, సిటీలోని ప్రతి కాలనీకి వెళ్లే బస్సులు 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులే ఉండాలనే టార్గెట్ పెట్టుకున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి వివరించింది. “తెలంగాణ రైజింగ్ విజన్ 2047’’ డాక్యుమెంట్ ను తయారు చేసిన ఆర్టీసీ దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఇందులో 2047 లోపు ఆర్టీసీ సాధించే లక్ష్యాలను  వివరించింది. 2035 నాటికి 30 శాతం ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్టు పేర్కొంది. 

వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లా కేంద్రాల్లోని పెద్ద బస్ స్టేషన్లతో పాటు హైవేపై ఉన్న డిపోలను ఎలక్ట్రిక్ చార్జింగ్ సెంటర్లుగా మార్చే ప్రయత్నంలో ఉన్నట్టు అందులో పేర్కొంది. 2047 నాటికి ఆర్టీసీ సంస్థను ఉద్యోగాలకు, వృత్తి నైపుణ్యానికి కేంద్రంగా మార్చే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు విజన్ డాక్యుమెంట్ లో యాజమాన్యం పేర్కొంది. 16 ఎలక్ట్రిక్ బస్సు డిపోలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది. 

అందులో నానక్ రాంగూడ, కోకాపేట, నార్సింగ్, శంషాబాద్, కందుకూరు, ఇస్నాపూర్, కీసర, ఘట్కేసర్, శామీర్ పేట, కుత్బుల్లాపూర్, మొయినాబాద్, అబ్దుల్లాపూర్ మెట్, తుర్కయాంజల్, శంకర్ పల్లి, ఫోర్త్ సిటీ ఉన్నట్టు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యకు తగ్గట్టుగా 16 ఎలక్ట్రిక్  చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్లాన్  చేస్తున్నట్టు విజన్ డాక్యుమెంటరీలో ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. 

అందులో ఎల్బీనగర్, ఐఎస్ సదన్, శంషాబాద్, వేవ్ రాక్, గండి మైసమ్మ, జగద్గిరిగుట్ట, కోఠి, మెహిదీపట్నం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఈసీఐఎల్, కేపీహెచ్‌‌బీ 4 ఫేజ్, వనస్థలిపురం, చర్లపల్లి రైల్వే స్టేషన్, చిలకలగూడ ఎక్స్ రోడ్, ఉప్పల్, ఇస్నాపూర్ ప్రాంతాలు ఉన్నాయని విజన్ డాక్యుమెంట్ లో ఆర్టీసీ యాజమాన్యం వివరించింది.