కేంద్రం సహకరించకపోయినా మక్కలు కొంటున్నాం : మంత్రి తుమ్మల

కేంద్రం సహకరించకపోయినా మక్కలు కొంటున్నాం : మంత్రి తుమ్మల
  • ఇందుకోసం రూ.2,400 కోట్లు కేటాయించాం: మంత్రి తుమ్మల
  • పంటల సేకరణపై అధికారులతో సమీక్ష

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా రైతుల నుంచి మక్కలు కొంటున్నామని, ఇందుకోసం  రూ.2,400 కోట్లు కేటాయించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల్లో మద్దతు ధర అమలు చేయకపోవడం వల్ల అక్కడి రైతులు ఇక్కడికి వచ్చి అమ్ముకునే అవకాశం ఉందని, దీని వల్ల మన రైతులు నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల రైతులు మన దగ్గర అమ్మితే సదరు అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. 

శనివారం సెక్రటేరియెట్​లో వ్యవసాయ, మార్కెటింగ్  శాఖల ఉన్నతాధికారులతో మంత్రి పంటల కొనుగోళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పత్తి, సోయా, పెసర లాంటి పంటలకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రెస్​ సపోర్ట్​ స్కీమ్ కింద సోయా, పెసర కొనుగోళ్లకు కేంద్రం నుంచి అనుమతుల కోసం కేంద్ర అధికారులకు లేఖ  రాయాలని సూచించారు. 

రైతులు పత్తిని దళారులకు అమ్మి మోసపోకుండా, సీసీఐ  సెంటర్లలో అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు.  మార్కెట్‌‌‌‌ యార్డుల్లో తేమ శాతం పరీక్షించే మాయిశ్చర్​  పరికరాలు,  సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ యంత్రాలు, పరికరాలకు ఇన్వెంటరీ నిర్వహిస్తూ క్రమం తప్పకుండా సర్వీసింగ్  చేయాలన్నారు.