‘పాలమూరు’ ఫేజ్ 1కు అనుమతులివ్వండి.. కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి

‘పాలమూరు’ ఫేజ్ 1కు అనుమతులివ్వండి.. కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి
  • డీపీఆర్ను క్లియర్​ చేయండి.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ ​లేఖ
  • ఫేజ్​ 1లో 45 టీఎంసీలను వాడుకుంటం
  • అన్ని ప్యాకేజీల్లోనూ ఐదు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తం
  • ఏపీ పేరుమార్చి పోలవరం-నల్లమలసాగర్​ కడుతున్నది
  • ఆ ప్రాజెక్టును కట్టకుండా ఏపీని నిలువరించండి
  • కర్నాటక ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని విజ్ఞప్తి
  • కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీకి లేఖ అందజేసిన రాహుల్​ బొజ్జా

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులపై పెండింగ్​లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు, ఏపీ చేపడుతున్న పోలవరం నల్లమలసాగర్​ ప్రాజెక్టు నిలుపుదల, సమ్మక్క సాగర్​ క్లియరెన్సులు తదితర అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుకు రాష్ట్ర ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి శనివారం లేఖ రాశారు. ఆ లేఖను కాంతారావుకు ఇరిగేషన్​ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా, ఇతర అధికారులు అందజేశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని లేఖలో కేంద్రాన్ని ఉత్తమ్​ కోరారు. ప్రాజెక్ట్​కు అనుమతులు లేట్​ అవుతుండడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలమూరు ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలను ఇప్పటికే నాగర్​కర్నూల్​ సీఈ క్లియర్​ చేస్తూ ఈ ఏడాది మే 6న లేఖ రాశారని, లేట్​ చేయకుండా అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రాజెక్ట్​ ఫేజ్​1లో భాగంగా తొలుత మైనర్​ ఇరిగేషన్​లో వాడుకోకుండా ఆదా చేసిన 45 టీఎంసీల వినియోగానికి అనుమతివ్వాలని లేఖలో మంత్రి ఉత్తమ్​ కోరారు. అందుకు తగ్గట్టు ఫేజ్​1 డీపీఆర్​కు క్లియరెన్సులు ఇవ్వాలన్నారు. 

ప్రాజెక్ట్​లోని ప్రతి ప్యాకేజ్​లో ఐదు పంపుల ద్వారా ఆ నీటిని వాడుకుంటామని స్పష్టం చేశారు. ఇక, ఫేజ్​2లో భాగంగా.. గోదావరి నుంచి ఏపీ డైవర్ట్​ చేసే 80 టీఎంసీల్లో తెలంగాణ వాటాగా ఉన్న 45 టీఎంసీలకు కృష్ణా ట్రిబ్యునల్​లో వాదనల అనంతరం క్లియరెన్సులు తీసుకుని పనులు చేపడతామని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టు  ఫేజ్​1 డీపీఆర్​కు అనుమతులివ్వాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. 

పోలవరం నల్లమలసాగర్ను ఆపండి
ఏపీ చేపడుతున్న పోలవరం బనకచర్ల ప్రాజెక్టును పేరు మార్చి పోలవరం నల్లమలసాగర్​గా ముందుకు వెళ్తున్నదని, ఆ ప్రాజెక్టును ఆపాలని కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్​ కోరారు. బనకచర్లపై తెలంగాణ ఇప్పటికే అభ్యంతరాలు తెలిపిందని, ఫిర్యాదు కూడా చేశామని గుర్తు చేశారు. ఇటు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రలూ అభ్యంతరం తెలిపాయన్నారు. అయినా కూడా ఏపీ ఆ అభ్యంతరాలను పట్టించుకోకుండా అక్టోబర్​ 3న డీపీఆర్​ తయారీకి టెండర్లను పిలిచిందని తెలిపారు. 

అయితే, ఆ తర్వాత టెండర్లను రద్దు చేసి.. బనకచర్ల ప్రాజెక్టు పేరును మార్చిందన్నారు. పోలవరం నల్లమలసాగర్​ లింక్​గా మార్చి డీపీఆర్​కు నవంబర్​ 21న టెండర్లను పిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్​ఆర్​) ఇంకా పరిశీలన దశలోనే ఉందని, కాబట్టి ఏపీ ప్రాజెక్టును చేపట్టకుండా చూడాలని కోరారు.  అలాగే, పీఎఫ్ఆర్​కు సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఇవ్వకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోండి
దిగువ రాష్ట్రాలకు నష్టం జరిగేలా కర్నాటక ప్రభుత్వం ఏకపక్షంగా ఆల్మట్టి డ్యామ్​ ఎత్తును 519 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుతున్నదని మంత్రి ఉత్తమ్​ అభ్యంతరం తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు పెంపు కోసం అక్టోబర్​ 9న కర్నాటక ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందన్నారు. డ్యామ్​ ఎత్తుపెంపుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, ఆ స్టే అమల్లో ఉండగానే కర్నాటక ఎత్తు పెంపుపై ముందుకు వెళ్తున్నదని ఆయన ఆరోపించారు. 

ఆల్మట్టి ఎత్తు పెంచితే దిగువన ఉన్న తెలంగాణలోని కృష్ణా ప్రాజెక్టులకు నీళ్లు అందవని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి కర్నాటక ఆల్మట్టి డ్యామ్​ ఎత్తు పెంచకుండా నిలువరించాలని, భూసేకరణను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటు సమ్మక్కసాగర్​ ప్రాజెక్ట్​ డీపీఆర్​కు కూడా త్వరగా క్లియరెన్సులు ఇవ్వాలని కేంద్రాన్ని ఆయన కోరారు. కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​ 2 వాదనలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

ఏడు ప్రాజెక్టులకు ఏఐబీపీ కింద అనుమతులివ్వండి
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన యాక్సిలరేటెడ్​ ఇరిగేషన్​ బెనిఫిట్​ ప్రోగ్రామ్​(ఏఐబీపీ) కింద ఏడు ప్రాజెక్టులకు ఇప్పటికే దరఖాస్తు చేశామని, ఆ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని మంత్రి ఉత్తమ్​ కోరారు. డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి, నారాయణపేట కొడంగల్​ లిఫ్ట్​, సీతారామ + సీతమ్మ సాగర్​ మల్టీపర్పస్​ ప్రాజెక్ట్​, పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్​, చిన్నకాళేశ్వరం, మోడికుంటవాగు, చనాక కొరాట ప్రాజెక్టులకు ఏఐబీపీ కింద అక్టోబర్​ 15న దరఖాస్తు చేశామని పేర్కొన్నారు. ఈ ఏడింటిలో చిన్నకాళేశ్వరం, చనకా కొరాట, మోడికుంటవాగు, సీతారామ–సీతమ్మ సాగర్​ ప్రాజెక్టులకు అడ్వైజరీ కమిటీ టెక్నో ఎకనమిక్​ అనుమతులకు క్లియరెన్స్​ ఇచ్చిందని గుర్తు చేశారు. వాటికి అనుమతులను ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు.