మెడికల్​ఎడ్యుకేషన్​ హబ్​గా తెలంగాణ : మంత్రి దామోదర

మెడికల్​ఎడ్యుకేషన్​ హబ్​గా తెలంగాణ : మంత్రి దామోదర
  •  క్వాలిటీ డాక్టర్లను తయారు చేసేలా మెరుగైన విద్య 

హైదరాబాద్, వెలుగు: మెడికల్​ఎడ్యుకేషన్​కు అత్యున్నత గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. క్వాలిటీ డాక్టర్లను తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కాలేజీలతోపాటు డెంటల్​ కాలేజీల్లో మెరుగైన విద్యనందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేస్తున్నామని, మెడికల్​ ఎడ్యుకేషన్​కు పూర్వవైభవం తెస్తామని చెప్పారు. 

బుధవారం ఆయన సెక్రటేరియెట్​లోని తన చాంబర్​లో ప్రైవేటు మెడికల్, డెంటల్​ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, డీన్లతో సమావేశమయ్యారు. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయొద్దని ఆయా విద్యా సంస్థలను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజారోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. గతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్​ కాలేజీల నుంచి మెడిసిన్​ చదివిన డాక్టర్లకు ఎంతో గౌరవం ఉండేదని గుర్తు చేశారు. 

ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా మెడిసిన్​ చదువును మెరుగుపరుస్తున్నామన్నారు. కాగా, రాష్ట్రంలో 28 ప్రభుత్వ మెడికల్​ కాలేజీల్లో 3,690 ఎంబీబీఎస్​ సీట్లు అందుబాటులో ఉండగా.. 28 ప్రైవేటు కాలేజీల్లో 4,600 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ మెడికల్​ కాలేజీల్లో 1,320 పీజీ సీట్లు, స్పెషాలిటీ పీజీ సీట్లు 179, ప్రైవేటు కాలేజీల్లో 1,566 పీజీ సీట్లు ఉన్నాయని తెలిపారు. 

కాగా, ప్రైవేటు మెడికల్, డెంటల్​ కాలేజీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా కాలేజీల యాజమాన్యాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి రాజనర్సింహ వారికి హామీ ఇచ్చారు. కొన్ని కాలేజీల్లో అవకతవకలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో మెడికల్​ఎడ్యుకేషన్​ డైరెక్టర్​వాణి, స్పెషల్​ ఆఫీసర్​ మెడికల్​ ఎడ్యుకేషన్​ విమలా థామస్​ తదితరులు పాల్గొన్నారు.