
- కులగణనపై అసెంబ్లీలో తీర్మానం.. ఏకగ్రీవంగా సభ ఆమోదం
- బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా లెక్కించేందుకు ఇంటింటి సర్వే
- తీర్మానం ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే కులగణన: సీఎం రేవంత్
- జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నోళ్లను పాలకులుగా చేయడమే లక్ష్యం
- దీనిపై అరశాతం ఉన్నోళ్లకు బాధ ఉండొచ్చు
- గతంలో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఏమైనయ్?
- ఆ రిపోర్టును ఒక కుటుంబం దాచుకున్నదని ఫైర్
- సర్వే పూర్తయ్యాక కులగణన బిల్లు: డిప్యూటీ సీఎం భట్టి
- బీసీ సబ్ ప్లాన్నూ అమలు చేస్తామని ప్రకటన
బీసీలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కులగణనకు ముందడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టి బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ జనాభాను లెక్కించనుంది. ఇప్పటి వరకు దేశంలో ఒక్క బీహార్ లోనే కులగణన పూర్తయింది. ఏపీలో కులగణన జరుగుతున్నది. ఈ రెండు రాష్ట్రాల తర్వాత కులగణనపై ముందడుగు వేసిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీల లెక్క తేలనుంది. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ కులాల జనాభాను ప్రభుత్వం లెక్కించనుంది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణనకు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మిగతా బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించాలని ఈ నెల 4న కేబినెట్ సిఫారసు చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని, ఇందుకోసం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అంశాలపైనా సర్వే ఉంటుంది” అని తీర్మానంలో ప్రభుత్వం పేర్కొంది.
ఇది రహస్యమేమీ కాదు: సీఎం
బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పని చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బడుగు బలహీనవర్గాలను బలపరిచేందుకే కులగణన నిర్వహిస్తున్నామని చెప్పారు. బలహీనవర్గాలను పాలకులుగా చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కులగణన తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్ మాట్లాడారు. యూపీఏ హయాంలో మైనార్టీల కోసం జస్టిస్ సచార్ కమిటీని ఏర్పాటు చేశారని, అది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపడుతున్నామని తెలిపారు.
కులగణనపై తీర్మానం ప్రవేశపెడితే, ప్రతిపక్ష నేతలు సలహాలు ఇవ్వకుండా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని రేవంత్ అన్నారు. ‘‘ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. తీర్మానానికి చట్టబద్ధత లేదనడం కరెక్ట్ కాదు. ఇది మేం రహస్యంగా నిర్వహించే కులగణన కాదు. ఇందులో ఏమైనా అనుమానాలుంటే చెప్పొచ్చు. రాష్ట్ర జనాభాలో అరశాతం ఉన్నోళ్లకు కులగణనపై కొంత బాధ ఉండొచ్చు. ఎందుకంటే సర్వే పూర్తయితే జనాభాలో 50 శాతం ఉన్నోళ్లకు రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందనేదే వాళ్ల బాధ. కడియం శ్రీహరిని పక్కనున్న వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు” అని కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం విమర్శించారు.
ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నేత సభకు వచ్చి, కులగణనపై మాట్లాడాలన్నారు. తాము పెట్టిన తీర్మానంలో ఎలాంటి అయోమయం లేదని.. కులగణనకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులను కోరారు. దేశంలో 1931లో మొదటిసారి కులగణన జరిగిందని, ఆ తర్వాత కాంగ్రెస్హయాంలో 2011లో జరిగిందని చెప్పారు. కానీ, మోదీ సర్కారు ఆ లెక్కలను బయటపెట్టలేదన్నారు.
మేనిఫెస్టోలపై చర్చిద్దాం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఏమయ్యాయని రేవంత్ ప్రశ్నించారు. ‘‘గత సర్కార్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. కానీ ఆ వివరాలు ఇప్పటికీ బయటపట్టలేదు. పదేండ్లు ఎందుకు దాచిపెట్టారు? ఆ లెక్కలు పబ్లిక్డొమైన్లో అందుబాటులో ఉంచలేదు. కానీ ఆ రిపోర్టు ఒక కుటుంబానికి మాత్రం అందుబాటులో ఉంది. ఆ కుటుంబమే ఆ నివేదికను దాచుకున్నది” అని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలపై చర్చించాలనే ఆలోచన ఉంటే, దానిపై ప్రత్యేక చర్చ పెడతామని చెప్పారు.
‘‘2014, 2018 బీఆర్ఎస్ మేనిఫెస్టోలు, 2023 కాంగ్రెస్ మేనిఫెస్టోపై చర్చిద్దాం. పదేండ్లలో బీఆర్ఎస్ ఎన్ని హామీలు ఇచ్చింది? ఎన్ని అమలు చేసింది?.. మేం అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో ఏమేం చేశామనే దానిపై చర్చిద్దాం. దీనికి బీఆర్ఎస్ఫ్లోర్ లీడర్ కేసీఆర్ అనుమతి తీసుకోండి. లేకపోతే మళ్లీ ఎవర్ని అడిగి ఒప్పుకున్నారని మిమల్ని ఆయన అడుగుతారు” అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి విమర్శలు చేశారు.
సమాజానికి ఎక్స్ రే లాంటిది: పొన్నం
దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ఎన్నికల టైమ్ లో రాహుల్ గాంధీ చెప్పారని, ఆయన ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మనిషి జబ్బును తెలుసుకునేందుకు ఎక్స్ రే ఏ రకంగా ఉపయోగపడుతుందో, సమాజంలోని కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు కులగణన ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి కులగణనకు కట్టుబడి ఉందని చెప్పారు. కులగణన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.
గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. కానీ ఆ వివరాలు ఇప్పటికీ బయటపెట్టలేదు. పదేండ్లు ఎందుకు దాచిపెట్టారు? ఆ లెక్కలు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచలేదు. కానీ ఆ రిపోర్టు ఒక కుటుంబానికి మాత్రం అందుబాటులో ఉంది. ఆ కుటుంబమే ఆ నివేదికను దాచుకున్నది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాడుకున్నది.
- సీఎం రేవంత్ రెడ్డి