తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఆదివారం సాయంత్రం అసెంబ్లీ, రాత్రి మండలిని నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సెషన్ లో సమావేశాలు నాలుగు రోజులకే పరిమితమయ్యాయి. తెలంగాణ రెండో అసెంబ్లీకి ఇదే చివరి సెషన్​కావడంతో స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. 2019 జనవరి 18న తాను స్పీకర్​గా బాధ్యతలు స్వీకరించానని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో తనకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎనిమిది సెషన్లలో సభను క్రమశిక్షణతో నడిపించడానికి, పద్దులు, సహా అన్ని అంశాలపై చర్చించడానికి అందరూ సహకరించారని తెలిపారు. హోం మంత్రి మహమూద్​అలీ మనవడి పెళ్లిలో ఢిల్లీకి చెందిన ఒక మత పెద్ద తన పక్కన కూర్చున్నారని, ఆయనే తనను పలుకరించి తెలంగాణ అసెంబ్లీని బాగా నడుపుతున్నారని ఢిల్లీలో చెప్పుకుంటున్నారని అనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. 

అసెంబ్లీ 26 గంటలు.. మండలి 23 గంటలు   

నాలుగు రోజుల ఈ సెషన్​లో 26.45 గంటల పాటు సమావేశాలు నిర్వహించారు. 44 మంది సభ్యులు సభలో మాట్లాడారు. ఎనిమిది బిల్లులు ఆమోదం పొందాయి. గవర్నర్​తిప్పి పంపిన మరో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టి వాటికి కూడా ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో వరదలు, విద్య, వైద్యం, పల్లె, పట్టణ ప్రగతి, తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిపై చర్చలు చేపట్టారు.  అలాగే శాసన మండలిని నాలుగు రోజుల్లో 23.10 గంటల పాటు నిర్వహించారు. సభలో 55  మంది సభ్యులు మాట్లాడారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను మండలిలోనూ ప్రవేశపెట్టి వాటికి ఆమోదం పొందారు. అసెంబ్లీ, కౌన్సిల్​సమావేశాలు ఎలాంటి అవాంతరాలు, సభ్యుల సస్పెన్షన్లు లేకుండా అర్థవంతంగా జరిగాయని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి తెలిపారు. చారిత్రక ఆర్టీసీ విలీన బిల్లును ఆమోదించుకున్నామని అన్నారు. గవర్నర్​అడిగిన వివరణలన్నీ ఇచ్చి బిల్లును సభలో ప్రవేశపెట్టామన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.