- హోరాహోరీకి అధికార, ప్రతిపక్షాలు రెడీ
- 22ఏ, హామీలపై పోరుకు ప్రతిపక్షాలు సిద్ధం
- కేసీఆర్ సభకు రావాలని కాంగ్రెస్ పట్టు
- కృష్ణా జలాలే లక్ష్యంగా బీఆర్ఎస్
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ
- కీలక బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం
- తొలిరోజు పలు వార్షిక నివేదికలు
- సెంట్రల్ హాల్‌ను ప్రారంభించనున్న సీఎం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. సభా కార్యక్రమాలు మొదలయ్యే ముందే ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ హాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ వర్షాకాల సమావేశాలు ఎన్ని రోజుల పాటు కొనసాగాలనే దానిపై ఉభయ సభల ప్రారంభం అనంతరం స్పీకర్ చాంబర్‌లో జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అసెంబ్లీ వేదికగా అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచించగా, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతి, క్యూర్‌లాంటి కొత్త బిల్లుల ఆమోదమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం సభ ముందుకు వస్తోంది.
మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు ముఖ్య సమస్యలపై సర్కారుపై ఒత్తిడి పెంచాలని ప్రతిపక్షాలు పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఈసారి వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా, రాజకీయ సమరాన్ని తలపించేలా సాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పాలనా సంస్కరణలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఉభయ సభల ఆమోదముద్ర వేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటితోపాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, వెయ్యి రోజుల పాలన, సంక్షేమ పథకాల అమలు తీరుపై సభలో ప్రత్యేక చర్చ జరపనున్నారు. ప్రతిపక్షాలు సంధించే విమర్శలకు శాఖలవారీగా గణాంకాలతో దీటుగా కౌంటర్ ఇవ్వాలని సీఎం ఇప్పటికే మంత్రులు, అధికార ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా సభకు హాజరవుతోంది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఇండ్లతోపాటు వ్యవసాయ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై యుద్ధానికి సిద్ధమైంది.
అమాయక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆ భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా నిలదీస్తామని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయకపోయినా, దీనిపై సరైన సమాధానం ఇవ్వకపోయినా సభను స్తంభింపజేయాలని నిర్ణయించింది.
వీటితోపాటు పాలిటెక్నిక్ విద్య కోసం తెచ్చిన వివాదాస్పద జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని పట్టుబట్టనున్నది. కృష్ణా నదీ జలాలను సమర్థవంతంగా వాడుకోకపోవడం, ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు చేపట్టకుండా జాప్యం చేస్తుండటంపై.. నీటిపారుదల అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పక్కా ఆధారాలతో సిద్ధమైనట్టు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఇప్పటికే స్పష్టం చేశారు.
కాగా, సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానుండగా, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కావడం లేదని బీఆర్ఎస్ ఇప్పటికే వెల్లడించింది. కేసీఆర్ సభకు రాకుంటే ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని ఒకవేళ ప్రభుత్వం డిమాండ్ చేస్తే, దానికి దీటుగా కౌంటర్ ఇచ్చేందుకు కూడాబీఆర్ఎస్ సిద్ధమైంది. .. హామీల అమలుపై ప్రశ్నించేందుకు బీజేపీ రెడీ..
మరోవైపు, బీజేపీ సైతం కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు తీరును ప్రశ్నించేందుకు రెడీ అయింది. 22ఏ, నిరుద్యోగులకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ, జాబ్ క్యాలెండర్ అమలుపై స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టనున్నది. వ్యవసాయ రంగానికి సంబంధించి పూర్తి రుణమాఫీ వైఫల్యం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతల సమస్యలను ప్రస్తావించనున్నారు. సింగరేణి సంస్థలో జరిగినట్టు చెబుతున్న కుంభకోణాలు, ఉద్యోగుల పీఆర్సీ, డీఏల బకాయిల చెల్లింపు, ఈహెచ్ఎస్ పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలపై నిలదీయాలని నిర్ణయించారు.
సభ ముందుకు మెట్రో లెక్కలు
మొదటి రోజే సభ ముందుకు పలు వార్షిక నివేదికలు రానున్నాయి. సభ ప్రారంభం కాగానే క్వశ్చన్ అవర్ ఉండనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మూడు నివేదికలను సభలో ప్రవేశ పెట్టబోతున్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్, పీఎం శ్రీ స్కూల్స్ ఆడిట్ నివేదికలు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ గత ఐదు వార్షిక రిపోర్టులను సభ ముందు ఉంచబోతున్నారు.
కంపెనీల చట్టం-2013లోని సెక్షన్ 395 ప్రకారం 2013–14 ఆర్థిక సంవత్సరం నుంచి 2017–18 వరకు గల హైదరాబాద్ మెట్రో వార్షిక నివేదికలను శాసనసభ ముందు సమర్పించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో మెట్రో ప్రాజెక్టు విస్తరణ, నిధుల వినియోగం, జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈ నివేదికల సమర్పణ తర్వాత సభలో ఆసక్తికర చర్చ జరిగే అవకాశం ఉంది.
