ఆటో కార్మికులకు నెలకు రూ. 15 వేలు ఇవ్వాలి : మారయ్య

ఆటో కార్మికులకు నెలకు రూ. 15 వేలు ఇవ్వాలి : మారయ్య
  •     తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య

ముషీరాబాద్,వెలుగు : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీతో రాష్ట్రంలోని 8 లక్షల మంది ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు రోడ్డున పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల సమస్యలపై ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ ఆటో మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ మహా ధర్నా నిర్వహించారు.  బీఆర్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ రూప్ సింగ్

నారాయణ, మారయ్య హాజరై మాట్లాడారు. మహాలక్ష్మి స్కీమ్ తో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు నెలకు రూ. 15 వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐతో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. సోమాజిగూడలో ఆటో కార్మికుడు సతీశ్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నట్టు, ప్రభుత్వం  బాధిత కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ధర్నా కొనసాగుతుందని తెలిపారు. ఆటో కార్మికులు రాజు యాదవ్,గోపాల్,విజయ రావు, డి శ్రీనివాస్, శాతం రమేష్, సంజీవ్, శ్రీనివాస్,నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.