బీసీల నోటికాడి కూడును లాక్కున్నరు..రెడ్డి జాగృతి నాయకులను బీసీ సమాజం క్షమించదు: బీసీ సంఘం నేతలు

బీసీల నోటికాడి కూడును లాక్కున్నరు..రెడ్డి జాగృతి నాయకులను బీసీ సమాజం క్షమించదు: బీసీ సంఘం నేతలు

బషీర్​బాగ్/ఓయూ, వెలుగు: బీసీల 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకున్న రెడ్డి జాగృతి నాయకులను బీసీ సమాజం క్షమించదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. కోర్టులో కేసు వేసి.. బీసీల నోటికాడి కూడును లాక్కున్నారని మండిపడ్డారు. వారి వైఖరికి నిరసనగా హైదరాబాద్ బషీర్ బాగ్ చౌరస్తాలో బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకుల దిష్టి బొమ్మను దహనం చేసి, రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. 

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుందారపు గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్,  కనకాల శ్యాంకుర్మా మాట్లాడారు. 4 శాతం లేని అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించారని.. 60 శాతం ఉన్న బీసీలకు 42 శాతం కల్పిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

ఓయూలో దిష్టిబొమ్మ దహనానికి యత్నం

ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రిజర్వేషన్ వ్యతిరేకులను గ్రామాల్లో తిరగనీయకుండా తగిన బుద్ధి చెప్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి యువజన పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బూర శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు గోదా రవీందర్, శ్రీనివాస్ ముదిరాజ్, వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.