V6 News

బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసు ఎదుట నిరసన

 బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసు ఎదుట నిరసన

ముషీరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్​తో గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఎదుట తెలంగాణ బీసీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం మాట్లాడుతూ.. తెలంగాణలో కుల గణన, స్థానిక సంస్థల రిజర్వేషన్లు దేశానికి రోల్ మోడల్ గా ఉంటాయని రాహుల్ గాంధీ చెప్పారని, అది నెరవేరకపోవడం వల్లనే ఢిల్లీలో నిరసన తెలుపుతున్నామన్నారు. కాంగ్రెస్ కు పార్లమెంటులో 236 మంది లోక్ సభ సభ్యులు ఉన్నందున, బీసీ రిజర్వేషన్లపై చొరవ తీసుకొని ప్రైవేట్ బిల్లు పెట్టి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. వెంటనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని అమలు చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో నీల వెంకటేశ్, సంజయ్ కుమార్, అనంతయ్య, మల్లేశం, మనోజ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలి..

ముషీరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డెఫ్ జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో కన్వీనర్ కాటమోని వెంకటేశ్​ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం బాగ్ లింగంపల్లిలో మాట్లాడారు. జనవరిలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.