
- తెలంగాణ వచ్చినప్పుడు.. ఇప్పుడు.. కేసీఆర్ ఆస్తులెన్ని?
- రాష్ట్రంలో దోచుకున్న సొమ్ము విదేశాల్లో దాచుకుంటున్నరు
- సీఎం అవినీతిపై నిఘా సంస్థల ఎంక్వైరీ మొదలైతది
- అంతేతప్ప ఫ్రంట్ లేదు.. టెంట్ లేదని బండి సంజయ్ ఎద్దేవా
హైదరాబాద్, వెలుగు: ‘‘దేశంలోనే నంబర్‌వన్ అవినీతిపరుడు సీఎం కేసీఆర్. అత్యంత అవినీతికి పాల్పడింది కూడా ఆయన కుటుంబమే. కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమైతది. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్, ఆయన కుటుంబ ఆస్తులెన్ని? ఈరోజు ఉన్న ఆస్తులెన్ని?” అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌కు ఓ ఫామ్ హౌస్, బిడ్డకు ఓ ఫామ్ హౌస్, అల్లుడికి ఓ ఫామ్ హౌస్ ఉన్నాయి. ఇగ కొడుక్కి 2, 3 ఫామ్ హౌస్‌లు, ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ దోచుకున్నదంతా దుబాయ్, సింగపూర్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో దాచుకుంటున్నారు’’ అని ఆరోపించారు. కేసీఆర్‌కు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి పెట్టాయని చెప్పారు. త్వరలో ఎంక్వైరీ స్టార్ట్ కాబోతున్నదని, ఈ విషయం తెలిసినప్పటి నుంచి తండ్రీ కొడుకు, అల్లుడు ఫ్రస్టేషన్‌కు పోయి, తెలంగాణను గాయిగాయి చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘కేంద్ర సర్కార్ ఎట్లాగో నన్ను అరెస్ట్ చేస్తది.. అంతకంటే ముందే నేనే లొల్లి చేస్తే ఓ పనైపోతది” అని కేసీఆర్ ప్లాన్ చేసి ఫెడరల్ ఫ్రంట్‌ను ముందేసుకున్నడని విమర్శించారు. అసలు విషయం ఇదేనని, ఫ్రంట్ లేదు.. టెంట్ లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రం ఎంత బాగయింతో ప్రజలకు తెలుసు
బంగారు తెలంగాణ అయిందని, ఇక బంగారు భారత్ చేస్తానని కేసీఆర్ గొప్ప చెప్తుండని సంజయ్ మండిపడ్డారు. ‘‘ బంగారు తెలంగాణ అయిందా? ఆత్మహత్యల తెలంగాణ అయిందా? దోపిడీ, దొంగల తెలంగాణ అయిందా? రాష్ట్రం ఎంత బాగయిందనేది ఇక్కడి ప్రజలకు తెలుసు. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు” అని చెప్పారు. కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడమే కేసీఆర్ పని అని విమర్శించారు. చివరికి ఏదీ దొరక్కపోతే.. ఉత్తర, దక్షిణ దేశాలుగా విభజించి మాట్లాడే నీచుడు అని ఫైరయ్యారు. దేశంలోనే అతిపెద్ద జూఠా ముఖ్యమంత్రి అని విరుచుకుపడ్డారు. ‘‘తుక్డే గ్యాంగ్ ప్రకాశ్ రాజ్‌తో కలిసిండంటేనే.. కేసీఆర్‌లో హిందూ వ్యతిరేక భావజాలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ హిందువుల పార్టీ అని, మోడీ, యోగి లేకపోతే హిందువులను కాపాడే వాళ్లెవరూ లేరని జీహాదీలు అంటున్నారు. మోడీ, యోగి లేని దేశం ఎట్లుంటదో, మన పరిస్థితి ఎట్లుంటదో హిందువులు, తెలంగాణ సమాజమం తా ఆలోచించాలి” అని సంజయ్ కోరారు.
ఏడేండ్లుగా ఎందుకడగలే
దేశంలోనే తొలిసారిగా మోడీ సర్కారు అవినీతి రహిత పాలన అందిస్తున్నదని గతంలో కేసీఆర్ చెప్పిన వీడియోలు ఉన్నాయని, మరి ఇప్పుడు మోడీ అవినీతి పరుడంటే కేసీఆర్‌ను నమ్మేదెవరని సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఏడేండ్లుగా మోడీని ఎందుకు అడగలేదని నిలదీశారు. తెలంగాణను నాశనం చేసింది కేసీఆరేనని విమర్శించారు. గవర్నర్ తమిళిసై మేడారం వెళ్తే అధికారులు, మంత్రులెవరు ఆమెను కలవొద్దని అనధికార ఆదేశాలిచ్చిన సంస్కారం లేని వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు.
పంచాయతీలకు పైసా ఇచ్చినవా?
నారాయణఖేడ్‌లో కేసీఆర్ మీటింగ్‌కు చాలా గ్రామాల నుంచి టీఆర్ఎస్ సర్పంచులు మీటిం గ్‌కు వచ్చి ఉంటారని, అందుకే పంచాయతీలకు ఠంచన్ గా డబ్బులు పంపిస్తున్నామని పచ్చి అబద్ధాలు చెప్పాడని సంజయ్ విమర్శించారు. ‘‘గ్రామాల్లో చేసిన పనులకు పైసలు రాక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. సభలో కింద కూర్చున్న సర్పంచ్‌లు కేసీఆర్ చెప్పే మాటలు విని థూ అంటున్నరు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులిచ్చిన దాఖలాలే లేవు” అని అన్నారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదద్శి కుమార్ పాల్గొన్నారు.
నమ్మినోళ్ల గొంతు కోయడం కేసీఆర్‌కు అలవాటే
కేసీఆర్ దోచుకున్న కోట్ల రూపాయలను కక్కించాల్సిందేనని, కేంద్రం ఆయన్ను జైలుకు పంపించడం పక్కా అని సంజయ్ అన్నారు. ‘‘ఇది తెలిసే కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతుండు. కేసీఆర్‌పై కేంద్రం కేసులు పెడితే మిగతా రాష్ట్రాల సీఎంలు అండగా నిలవాలనే కొత్త డ్రామా మొదలుపెట్టాడు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, బెంగాల్ ప్రజలు, అక్కడి పార్టీల నేతలు ఈ దోకేబాజీని నమ్మొద్దు. నమ్మినోళ్ల గొంతు కోయడం కేసీఆర్‌కు అలవాటు. తెలంగాణ ఉద్యమంలో 1,400 మంది చనిపోతే అందులో సగం మందిని కూడా గుర్తించి సాయం చేయని దుర్మార్గుడు” అని మండిపడ్డారు.