
- జార్ఖండ్లో పట్టుబడిన నోట్లు లెక్కిస్తుంటే మెషీన్లే వేడెక్కుతున్నయ్: కిషన్ రెడ్డి
- ఇంత అక్రమ సంపాదన దొరకడం దేశంలోనే ఇదే తొలిసారి
- అంతటి ఖ్యాతి ఆ పార్టీకే దక్కిందని ఎద్దేవా
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి, అవినీతికి విడదీయలేని బంధం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటిపై ఐటీ సోదాల్లో రూ.290 కోట్ల అక్రమ సంపాదనను అధికారాలు స్వాధీనం చేసుకున్నారని, ఒకే చోట ఇంత అక్రమ సంపాదన బయట పడటం దేశంలో ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఈ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డబ్బులు లెక్కించే యంత్రాలు వేడెక్కి మొరాయిస్తున్నాయే తప్ప.. లెక్కించడం మాత్రం పూర్తికావట్లేదన్నారు. రాంచీలోని 8 బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నాయని గుర్తించి ఆదాయ పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారని అన్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
రాహుల్ ఎందుకు మాట్లాడ్తలే?
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన అనుచరుడు ధీరజ్ సాహు అని, కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు జరిగితే రాహుల్ గాంధీ కేంద్రాన్ని విమర్శిస్తారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ దాడులపై ఆయన ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల కోసం ఈ డబ్బులు కూడబెడుతున్న నోట్లేమోనని అనుమానం వ్యక్తం చేశారు. జోడో యాత్రకు స్పాన్సర్ అంతా ధీరజ్ సాహునే అని, ఓడిపోయిన వ్యక్తిని మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ధీరజ్ లాంటి అవినీతి పరులు రాహుల్ కు ఎంతో మంది సన్నిహితంగా ఉన్నారని ఆరోపించారు. తొమ్మిదిన్నరేండ్లుగా నీతివంతమైన పాలన అందిస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం అని, మరోసారి మోదీనే ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తో కుంభకోణాలకు పాల్పడిన ఆమ్ ఆద్మీ, తృణమూల్ పార్టీలు అత్యంత సన్నిహితమైనవని, తెలంగాణలో కర్నాటక డబ్బులు ఖర్చు చేశారని, కర్నాటకలో అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
మ్యారేజ్ ఇండియాగా టూరిజం డెవలప్ మెంట్
రాబోయే రోజుల్లో మ్యారేజ్ ఇన్ ఇండియాగా టూరిజం అభివృద్ధి జరగాలని, మన దేశానికి చెందినోళ్లు విదేశాలకు పోయి పెళ్లిళ్లు చేసుకోకుండా ఇక్కడే జరుపుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ఆదివారం మాదాపూర్ లోని ఓ హోటల్ లో ప్రారంభమైన సౌత్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన సదస్సులో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సుకు హాజరైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక, అస్సాం, మేఘాలయాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. అనేక దేశాలు టూరిజం సెక్టార్ ద్వారా రెవెన్యూ పెంచుకుంటున్నాయని, మన దేశంలోనూ డొమెస్టిక్ టూరిజంను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని టూరిస్ట్ డెస్టినేషన్స్ కు కనెక్టివిటీ పెంచుతున్నామని, రానున్న రోజుల్లో ఢిల్లీలో గ్లోబల్ టూరిస్ట్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కార్యక్రమం జరగనుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. వైబ్రంట్ విలేజర్స్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా భారత సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలను టూరిస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్స్ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఫైళ్ల మాయంపై ఎంక్వైరీ జరిపించాలి
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు కీలక ఫైళ్లు మాయం కావటంపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఫైళ్ల మాయం, చించటంపై ఎన్నో అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని, ఎంక్వైరీతో అవి బైటికి వస్తాయని తెలిపారు. బీజేపీ పక్షనేత ఎవరనే అంశంపై పార్టీలో చర్చించాల్సి ఉందని, ఆ తర్వాతనే బీజేపీ ఎల్పీ లీడర్ ఎవరనేది నిర్ణయిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.