ప్రజా సమస్యలపై జనంలోకి బీజేపీ.. జిల్లాల్లో బస్సుయాత్రలకు ప్లాన్

ప్రజా సమస్యలపై జనంలోకి బీజేపీ.. జిల్లాల్లో బస్సుయాత్రలకు ప్లాన్

కేసీఆర్ సర్కార్ పై పోరాడేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రజాసమస్యల పరిష్కారం కోసం జనంలోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఎలక్షన్స్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర బీజేపీ నేతలు బిజీ బిజీగా మారారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జనంలోకి వెళ్లి సమస్యలను ఎత్తి చూపుతూ రాష్ట్ర సర్కార్ ను ఇరుకున పెట్టాలని వ్యూహా రచన చేస్తున్నారు. 

ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించనున్నారు. తరచూ ఈ ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో స్థానిక నాయకులతో పర్యటిస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. మరోవైపు.. అన్ని జిల్లాల్లోనూ బస్సు యాత్రలు చేపట్టాలని బీజేపీ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

ఇటు రేషన్ కార్డులపైనా ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు.. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాదయాత్రపైనా బీజేపీ నేతలు ఆలోచనలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి నాయకుల చేరికలపైనా బీజేపీ ఫోకస్ పెట్టింది. మొత్తంగా ప్రజల్లోకి వెళ్తూ..  ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కార్యాచరణ రూపొందిస్తున్నారు.