నిధులు, ప్రాజెక్టులు తేవడంలో బీజేపీ ఫెయిల్.. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతుంది

నిధులు, ప్రాజెక్టులు తేవడంలో బీజేపీ ఫెయిల్.. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతుంది
  •     మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ (అక్కన్నపేట), వెలుగు : రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్  హితవు పలికారు. శనివారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పెద్దతండా గ్రామంలో మీడియాతో మాట్లాడారు.

 దక్షిణాది నుంచి నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో తెలంగాణ వాటా ఎంత? కేంద్రం తిరిగి తెలంగాణకు ఇస్తున్న నిధులు ఎంత? అనే లెక్క తీస్తే కేంద్రం చేస్తున్న అన్యాయం బయటపడుతుందన్నారు. పన్నుల రూపంలో నిధులు తీసుకెళ్లడం తప్ప, రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు ఇవ్వడంలో కేంద్రం మొండిచేయి చూపుతోందని మండిపడ్డారు. 

పక్క రాష్ట్రాలకు విచ్చలవిడిగా నిధులిస్తూ తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతున్నారని ఫైర్​ అయ్యారు. ‘తెలంగాణ రైజింగ్‌‌‌‌  2047’ లక్ష్యంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడానికి, అంతర్జాతీయ వేదికలపై మన సామర్థ్యాన్ని చాటేందుకు సీఎం చేపట్టిన విదేశీ పర్యటనలకు అనుమతులు నిరాకరించడం కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు. 

కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పటికైనా ఢిల్లీ గులాంగిరీ వదిలి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తెప్పించాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రం సహాయ నిరాకరణ చేస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

‘గౌరవెల్లి’ పూర్తి చేయకపోతే ఓట్లడగను

 గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతానని, ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో కేసు క్లియర్ కావడంతో ప్రాజెక్టు పనులకు మార్గం సుగమమైందని, కాలువల భూసేకరణ వేగంగా జరుగుతోందని చెప్పారు. శనివారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెకు ప్రజాపాలన’ ప్రోగ్రామ్ నిర్వహించారు. 

మండలంలోని పెద్దతండా, మోత్కులపల్లి, మంచినీళ్ల బండ, కేశవపూర్, గొల్లపల్లి, మల్లంపల్లి, చౌటపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములిచ్చిన చౌటపల్లి రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అక్కన్నపేట వరకు ఫోర్ లేన్ రోడ్డు పనులు జరుగుతున్నాయని, సర్కారు బడులకు టాయిలెట్లతో పాటు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తామన్నారు.