
కర్నాటక ఎన్నికల ప్రచారంలో మన రాష్ట్ర బీజేపీ నేతలు
ఇప్పటికే క్యాంపెయిన్లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి
త్వరలో వెళ్లనున్న మరికొందరు సీనియర్ నాయకులు
హైదరాబాద్, వెలుగు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలకు పార్టీ హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే సర్వజన్ నగర్ అసెం బ్లీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బళ్లారిలో పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కుష్ఠగి సెగ్మెంట్లో సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బుధవారం బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం ప్రారంభించారు.
త్వరలోనే మరి కొంత మంది రాష్ట్ర సీనియర్ నేతలు కూడా వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల కో ఇన్చార్జ్గా ఉన్న పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. త్వరలోనే ఆమె మళ్లీ కర్నాటకకు వెళ్లనున్నారు. వీరితో పాటు తెలంగాణకు చెందిన పలువురు మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఆఫీసు బేరర్లు, వివిధ మోర్చాల నేతలు అక్కడి ప్రచారంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు.
తెలంగాణ సరిహద్దుల్లోని బీదర్, రాయచూర్, యాద్గిర్ జిల్లాలతో పాటు.. తెలుగు వారు ఎక్కువగా ఉండే బళ్లారి, గుల్బర్గా జిల్లాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ హైకమాండ్ తెలంగాణ నేతలకు అక్కడి నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది.