బీజేపీలో పరిణామాలపై ఆ ఇద్దరు సైలెంట్​!

బీజేపీలో పరిణామాలపై ఆ ఇద్దరు సైలెంట్​!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ సీనియర్​ నేతలు కిషన్​రెడ్డి, లక్ష్మణ్​ స్పందించేందుకు ఇష్టపడటం లేదు. కొద్దిరోజులుగా రాష్ట్ర బీజేపీలో కొత్త కమిటీలు అంటూ, ఎలక్షన్​ కమిటీల దిశగా మార్పులు చేర్పులు అంటూ రకరకాల ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ప్రచార కమిటీ బాధ్యతలు ఇస్తారనే చర్చ  మీడియాలో చక్కర్లు కొడ్తున్నది. దీంతో పార్టీలోని ఇతర నేతలు.. కొత్త కమిటీల ఏర్పాటు అంశాలపై పార్టీ జాతీయ నాయకత్వం సీనియర్లతో చర్చిస్తుందని, బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని మీడియాతో మాట్లాడారు.

పార్టీలో పదవుల మార్పు, కొత్త కమిటీల నియామకంపై కేసీఆరే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. అయితే.. మరోవైపు జాతీయ పార్టీ  నేతలతో నిత్యం టచ్ లో ఉండే రాష్ట్రానికి చెందిన కిషన్​రెడ్డి, లక్ష్మణ్​ మౌనంగా ఉండటం క్యాడర్​లో చర్చకు దారితీసింది. కిషన్​రెడ్డి కేంద్ర మంత్రి కాగా.. లక్ష్మణ్​ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంట్ వ్యవహారాల కమిటీ, కేంద్ర పార్టీ ఎన్నికల కమిటీ వంటి కీలక కమిటీల్లో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. రాష్ట్రం తరపున బీజేపీ జాతీయ నాయకత్వానికి ఈ ఇద్దరు నేతలు అత్యంత నమ్మకస్తులు. రాష్ట్రానికి సంబంధించి పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా... రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా .. ఢిల్లీ నేతలు ముందుగా ఈ ఇద్దరు నేతలనే సంప్రదిస్తారు.

వీరిద్దరూ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. పార్టీ లీడర్లలో, క్యాడర్ లో కొంత అయోమయం, గందరగోళం నెలకొన్నా.. మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని  పార్టీ స్టేట్ ఆఫీసులో ఇటీవల వరుసగా మూడు సార్లు  ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించారు. కేంద్ర మంత్రి హోదాలో అధికారిక అంశాలపై మాట్లాడారు తప్ప రాజకీయాలపై స్పందించలేదు. రాష్ట్రంలోని పార్టీ పరిణామాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పటికీ.. కిషన్​రెడ్డి  ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిందంటూ వేదికపై నుంచి లేచి వెళ్లిపోయారు. వారం రోజులుగా లక్ష్మణ్  పార్టీ స్టేట్ ఆఫీసుకు రావడం లేదు. మీడియాకు అందుబాటులో ఉండటం లేదు.