హైదరాబాద్, వెలుగు: దేశంలో అశాంతిని సృష్టించి, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ శక్తులు కుట్ర పన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. శ్రీలంక, బంగ్లాదేశ్ తరహాలో కల్లోలం రేపేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ద్వారా 'అల్ట్రా లెఫ్ట్' శక్తులు స్కెచ్ వేశాయని మండిపడ్డారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ విచ్ఛిన్నకారులకు ఖతార్, కెనడా, పాక్, బంగ్లాదేశ్తో పాటు ఇతర దేశాల నుంచి ఫండింగ్ అందుతోందన్నారు.
నీట్ ముసుగులో కాంగ్రెస్ ఆందోళనలు..
నానమ్మను పొట్టనబెట్టుకున్న ఖలిస్థానీ శక్తులతో రాహుల్ గాంధీ జతకట్టడం సిగ్గుచేటని రాంచందర్ రావు ధ్వజమెత్తారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఎస్ఏ వంటి సంఘాలు కొత్త ముసుగులో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు. నీట్ లీకేజీ తెలియగానే మోదీ ప్రభుత్వం 31 మందిని అరెస్ట్ చేసిందని, మహారాష్ట్రలో లీకేజీ వెనుక కాంగ్రెస్ అనుకూల వ్యక్తులే ఉన్నారని తెలిపారు. విద్యార్థులు రాకపోయినా స్వార్థం కోసం కాంగ్రెస్ ఆందోళన చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేశ వ్యతిరేక శక్తులకు సపోర్ట్ చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ఫీజుల బకాయి బీజేపీ లడాయి..
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కారు 25 లక్షల మంది భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని రాంచందర్ రావు విమర్శించారు. నిజాం కాలేజీలో బీజేవైఎం ఆధ్వర్యంలో ‘ఫీజుల బకాయి - బీజేపీ లడాయి’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. సౌత్ ఇండియాలోనే అత్యధికంగా 6.8 శాతం నిరుద్యోగిత రేటు ఒక్క తెలంగాణలోనే ఉందన్నారు.
ఎలక్షన్ల ముందు జాబ్ క్యాలెండర్ అని చెప్పి అధికారంలోకి వచ్చాక యువతను నట్టేట ముంచారని, బీజేవైఎం, మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఊరూరా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలోనూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్, జనరల్ సెక్రటరీ మల్క యశస్వీ, బీజేపీ రాష్ట్ర నేతలు గౌతంరావు, జయశ్రీ, గువ్వ బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
