తెలంగాణలో రానున్న 100 రోజులు బీజేపీకి కీలకం : కిషన్ రెడ్డి

తెలంగాణలో రానున్న 100 రోజులు బీజేపీకి కీలకం : కిషన్ రెడ్డి

రానున్న 100 రోజులు బీజేపీకి కీలకమన్నారు తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి. జులై 24వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కోసం ధర్నాలు చేస్తామని చెప్పారు. జులై 25న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులతో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కూడా మహాధర్నా చేపడుతామని వెల్లడించారు. కొత్త పెన్షన్ దారులు,  కొత్త రేషన్ కార్డుల కోసం కూడా బీజేపీ నిత్యం పోరాటం చేస్తుందన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన రేషన్ కార్డులే.. ప్రస్తుతం ఉన్నాయని, తెలంగాణ వచ్చాక  కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. 

తాను తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడిగా సమిష్టి నాయకత్వంతో ముందుకెళ్తామన్నారు కిషన్ రెడ్డి. తనను పోలీసులు అరెస్ట్ చేసినా.. అలసిపోలేదన్నారు. తాను గతంలో పార్టీ ఆఫీసులోనే ఉంటూ కాలేజీకి వెళ్తూ కష్టపడి పైకి వచ్చానన్నారు. సాధారణ రైతు కుటుంబ నుంచి వచ్చిన తాను బీజేపీలో ఒక కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి చేరుకున్నానని తెలిపారు. కాలేజీ రోజుల్లో పూర్తి సమయం బీజేపీ పార్టీ కోసం వెచ్చించానన్నారు. ఒక సాధారణ కార్యకర్త అయిన తాను జాతీయ పార్టీకి 4వ సారి రాష్ర్ట అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని చెప్పారు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి స్థాయికి చేర్చిన ఘనత అది ఒక బీజేపీకే సాధ్యమన్నారు. తాము సిద్దాంతమే ఊపిరిగా పని చేశామన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడి పని చేశామన్నారు. 

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ర్ట ప్రభుత్వాలపై నిరంతరం పోరాటం చేశానని చెప్పారు కిషన్ రెడ్డి. కష్టపడి పని చేసేవారికి తప్పనిసరిగా పదవులు వస్తాయన్నారు. తప్పకుండా ఏదో ఒకరోజు అందరికీ అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. తాను ఏదీ ఆశించి పని చేయలేదన్నారు. తాను మూడుసార్లు ఎమ్మెల్యే, కేంద్రమంత్రి అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. పేరు కోసం ఏనాడు పని చేయలేదని చెప్పారు. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందన్నారు. ఈ విషయంలో భారతదేశంలోని140 కోట్లమంది ప్రజలు గర్వపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

మోడీ నాయకత్వంలో దేశంలో నీతివంతమైన పాలన కొనసాగుతోందన్నారు కిషన్ రెడ్డి. ఇవాళ బీజేపీకే కాకుండా  ప్రపంచానికే మోడీ నాయకుడయ్యారని చెప్పారు. ఈ విషయంలో బీజేపీ ప్రతి కార్యకర్త కూడా గర్వపడాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా.. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అనాడే ప్రధాని చెప్పారని తెలిపారు. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టం ఇప్పుడు ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్నారు. నయా నిజాం తరహాలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పరిపాలనకు ప్రజలందరూ చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. 

‘‘యుద్ధం అంటూ జరిగితే కత్తికి కూడా కన్నీరు వస్తుందేమో. కనికరం వస్తుందేమో.. కానీ, తెలగాణ ప్రజలకు మాత్రం కనికరం ఉండదు కేసీఆర్. బండి సంజయ్ రాష్ర్ట అధ్యక్షుడిగా ఉన్నప్పుడే యుద్ధం ప్రారంభమైంది. తెలంగాణ చర్రిత్రలో నన్ను అకారణంగా అరెస్ట్ చేశారు. పార్టీ శ్రేణులకు పిలుపు ఇవ్వకముందే మా నాయకులను ఎక్కడికక్కడే హౌజ్ అరెస్ట్ లు చేయించారు. ఏ రాష్ర్టంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. నియంత పాలనలో ప్రజలు ఆందోళనలు చేయడానికి హక్కులేదా..? ప్రజా హక్కులను కాలరాస్తారా..? పోరాటాలు చేయనిదే మీరు ముఖ్యమంత్రి అయ్యారా..? 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటేనే మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. ఈరోజు సమయం వచ్చింది. కేసీఆర్ కుటుంబాన్ని ఫాంహౌజ్ లో అరెస్ట్ చేయిస్తాం. ఇవాళ తెలంగాణ ప్రజలు చైతన్యవంతులయ్యారు. మేము మీ కుటుంబానికి బానిసలం కాదు. మీరు దోపిడీ చేస్తుంటే మాట్లాడకూడదా...? ఇచ్చిన హామీల గురించి మాట్లాడవద్దా...?  మీరు కోట్లు ఖర్చు పెట్టి 10 ఎకరాల్లో నిజం భవనాన్ని తలపించే ఇంద్రభవనం కట్టుకోవచ్చు కానీ.. నిరుపేదలకు ఇండ్లు వద్దా..?’’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.