- బడ్జెట్ లో పెరిగిన కేటాయింపులు
- మొత్తంగా ఇండస్ట్రీస్‌కు రూ.3,747 కోట్లు ప్రతిపాదన
- ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ కోసం అదనంగా రూ.1,835 కోట్లు
హైదరాబాద్, వెలుగు: పల్లెల్లో పరిశ్రమలకు ప్రభుత్వం దన్నుగా నిలిచింది. బడ్జెట్లో నిధులు పెంచింది. గ్రామాల్లోని కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు రూ.984.83 కోట్లు కేటాయించింది. నిరుడు బడ్జెట్లో రూ.670.95 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు రూ.313.88 కోట్లు అదనంగా ప్రతిపాదించింది. చిన్నపరిశ్రమల్లో హ్యాండ్లూమ్అండ్ టెక్స్‌టైల్స్‌కు రూ.241.96 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
నేత కార్మికులకు బీమా కోసం కేటాయింపులను రూ.11.25 కోట్ల నుంచి రూ.17.79 కోట్లకు పెంచింది. బడ్జెట్లో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వం మొత్తంగా రూ.3,747 కోట్లు కేటాయించింది. అందులో భారీ, మధ్య తరహా పరిశ్రమలకూ రూ.1,134.53 కోట్లు కేటాయించింది. నిరుడు రూ.896.30 కోట్లు ఇవ్వగా.. ఇప్పుడు నిధులు పెరిగాయి. షుగర్స్ కమిషనర్‌కు రూ.138.75 కోట్లు ప్రతిపాదించింది. రావిర్యాలలోని ఈ సిటీకి రూ.19.70 కోట్లు, మహేశ్వరంలో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్ సిటీ కోసం రూ.26.47 కోట్లు కేటాయించింది.
ఇండస్ట్రియల్ ప్రమోషన్‌కు ఇన్సెంటివ్స్..
రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ చెల్లింపుల కోసం ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. అందుకు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఇన్సెంటివ్స్ కోసం రూ.1,835 కోట్లు కేటాయించింది. అందులో గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.655 కోట్లు ఇన్సెంటివ్స్గా ఇవ్వనుంది. మరోవైపు పరిశ్రమలకు పవర్ సబ్సిడీ కోసం రూ.250 కోట్లు కేటాయించింది. నిమ్జ్ భూసేకరణకు రూ.96.50 కోట్లను ప్రతిపాదించింది. శాండ్ మైనింగ్ కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల కేటాయింపులు చేసింది.
