
- రాజ్‌భవన్‌కు వెళ్లి ఆహ్వానించిన ప్రశాంత్ రెడ్డి
- అసెంబ్లీ ప్రొరోగ్, గవర్నర్ తమిళిసై స్పీచ్‌పై కసరత్తు షురూ
- నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం
హైదరాబాద్, వెలుగు: గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా నిర్ణయించినట్టుగా ఫిబ్రవరి 3న బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 6న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, కౌన్సిల్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతారని ప్రగతిభవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలిపేలా ఆదేశించాలని కోరుతూ ప్రభుత్వం సోమవారం హైకోర్టులో పిటిషన్ వేసింది. సర్కారుకు అనుకూలంగా ఆదేశాలు వచ్చే అవకాశాలు లేకపోవడంతో గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సెషన్ ప్రారంభిస్తామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇరువర్గాల అంగీకారంతో పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్టు సీజే ప్రకటించారు.
బడ్జెట్ సమావేశాల కసరత్తు మొదలు
హైకోర్టు సూచనలతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి సమావేశమయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. చర్చల తర్వాత గవర్నర్ ప్రసంగం కాపీ రెడీ చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. తెలంగాణ రెండో అసెంబ్లీ 8వసెషన్, కౌన్సిల్ 18వ సెషన్ కొనసాగుతుండటంతో గవర్నర్ ప్రసంగానికి వీలుగా వెంటనే ఉభయ సభలను ప్రొరోగ్ చేయాలని సూచించారు. గవర్నర్ అనుమతితో ఉభయ సభలను సమావేశపరిచే తేదీని నిర్ధారిస్తూ బులెటిన్ జారీ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. మంగళవారం సాయంత్రానికి స్పీచ్ కాపీ సిద్ధం చేసి గవర్నర్‌కు పంపాలని ఆదేశించినట్టు తెలిసింది. ఫిబ్రవరి 3నే అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభించాలని సూచించారు. ఇదే విషయం గవర్నర్‌కు తెలియజేయాలని ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. అసెంబ్లీ, కౌన్సిల్ ప్రొరోగ్, కొత్త సెషన్‌పై బులెటిన్ జారీ ప్రక్రియను మంగళవారం పూర్తి చేయాలన్నారు.
గవర్నర్ తమిళిసైతో మంత్రి ప్రశాంత్ రెడ్డి భేటీ
మంత్రి ప్రశాంత్ రెడ్డి సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం ఆదేశాలతోనే ప్రశాంత్ రెడ్డి రాజ్‌భవన్‌కు వచ్చారు. బడ్జెట్ సెషన్ సందర్భంగా అసెంబ్లీ, కౌన్సిల్ జాయింట్ సెషన్ ను ఉద్దేశించి ప్రసంగించాలని ఆమెను ఆహ్వానించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఈ సందర్భంగా గవర్నర్ బదులిచ్చినట్టు సమాచారం. ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించేందుకు తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని గవర్నర్ చెప్పినట్టుగా తెలిసింది. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బిల్లులను వీలైనంత త్వరగా ఆమోదించాలని గవర్నర్‌ను ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. మంత్రి వెంట అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు ఉన్నారు. గవర్నర్‌తో భేటీ తర్వాత మంత్రి, అధికారులు ప్రగతి భవన్‌కు వెళ్లి చర్చల సారాంశాన్ని కేసీఆర్‌కు వివరించారు.