సాదాబైనామాలు, ఆస్తుల వివరాల కోసం రెండు ఆర్డినెన్స్​లు

సాదాబైనామాలు, ఆస్తుల వివరాల కోసం రెండు ఆర్డినెన్స్​లు

 

  • ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్​!

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు వేలెత్తిచూపిన అంశాలపై రాష్ట్ర కేబినెట్​ కీలక నిర్ణయాలు తీసుకుంది. జరిగిన తప్పులను సవరించుకునేందుకు ఆర్డినెన్స్​లు తీసుకురావాలని నిర్ణయించింది. సాదాబైనామాల రెగ్యులరైజేషన్​కు వీలుగా  రెవెన్యూ చట్ట సవరణ చేస్తూ ఒక  ఆర్డినెన్స్, ఇప్పటికే చేపట్టిన ప్రజల ఆస్తుల వివరాల సేకరణ కోసం మరో ఆర్డినెన్స్ కు కేబినెట్​ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అప్లయ్​ చేసుకున్న సాదాబైనామాలను ఎలా ఆమోదిస్తారని ఇటీవల ప్రభుత్వాన్ని హైకోర్టు  ప్రశ్నించింది. ఆస్తుల వివరాల నమోదు ఏ చట్టం ప్రకారం చేస్తారని మరో కేసులో హైకోర్టు తప్పుపట్టింది. కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం తమ వాదనను వినిపించేందుకు వీలుగానే ఈ ఆర్డినెన్స్​లకు  కేబినెట్​ ఓకే  చెప్పినట్లు సమాచారం. ఈ రెండు ఆర్డినెన్స్ లను గవర్నర్  ఆమోదం కోసం పంపినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశమైన కేబినెట్ ముందుగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు ఆమోదం తెలిపింది. ఆతర్వాత రెండు ఆర్డినెన్స్ లు తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్  ఇచ్చినట్టు తెలిసింది. గ్రేటర్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే చాన్స్ ఉందని మంత్రులతో సీఎం కేసీఆర్​ అన్నట్లు సమాచారం. ఎన్నికల బాధ్యతలు తీసుకున్న మంత్రులు ఎక్కువ టైం ప్రచారానికి కేటాయించాలని ఆయన ఆదేశించినట్టు  తెలిసింది.

కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం?

సన్న వడ్లకు బోనస్ ఇచ్చేందుకు తాము  సిద్ధంగా ఉన్నా  కేంద్రం తీరు వల్లే ఇవ్వడం లేదని రాష్ట్రం వాదిస్తున్నది. ఇదే విషయాన్ని మంత్రి హరీశ్ రావు సిద్దిపేట జిల్లాలో చెప్పారు.  సన్న వడ్లకు ఎక్కువ ధర ఇస్తే తాము కోనుగోలు చేయలేమని ఎఫ్ సీ ఐ అంటున్నదని చెప్పారు. నిజానికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఇస్తే ఆ ధరను మాత్రమే తాము భరించలేమని ఎఫ్​సీఐ తన లెటర్​లో పేర్కొంది. దుబ్బాక ఎన్నికల ముందు బోనస్ ఇస్తామని చెప్పిన సీఎం​.. ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.  సీఎం చెప్పారని సన్న వడ్లు పండిస్తే గిట్టుబాటు అయితలేదని, ఇప్పటికే వానలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.