తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర మంత్రివర్గం తాజాగా తీసుకున్న 'పేరెంట్స్ సపోర్ట్ బిల్లు' (తల్లిదండ్రుల పోషణ బిల్లు) నిర్ణయం సామాజిక వర్గాల్లో చర్చకు దారితీసింది. కన్నవారిని నిర్లక్ష్యం చేసే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతం నుంచి 15 శాతం కోత కోసి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాలని ప్రతిపాదించారు. మారుతున్న కాలంలో మానవీయ విలువలు మంటగలుస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక సాహసోపేతమైన అడుగు. చదువు చెప్పించి, ప్రయోజకులను చేసిన కన్న తల్లిదండ్రులను వృద్ధాప్యంలో రోడ్డున పడేసే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చట్టం వారిలో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.
భారతీయ సంస్కృతిలో ‘మాతృదేవోభవ.. పితృదేవోభవ’ అనేది కేవలం ఒక సూక్తి మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. కానీ, ఆధునికత పేరుతో పెరుగుతున్న యాంత్రీకరణ, వ్యక్తిగత స్వేచ్ఛావాదం పర్యవసానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. చదువు చెప్పించి, తమ రక్తాన్ని చెమటగా మార్చి పిల్లలను ప్రయోజకులను చేసిన ఎందరో తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఒంటరివారవుతున్నారు. కొడుకులు, కోడళ్లు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా, కన్నవారికి కనీసం ఒక పూట అన్నం పెట్టడానికి, మందులు కొనడానికి ఇష్టపడని పరిస్థితులు నేడు సమాజంలో సర్వసాధారణమయ్యాయి. ఈ సామాజిక రుగ్మతను నయం చేయడానికి కేవలం నీతి వాక్యాలు సరిపోవని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, 'జీతం కోత' అనే కఠిన నిర్ణయానికి పూనుకుంది.
ఆర్థిక స్వావలంబన
ఈ చట్టం ప్రాథమిక లక్ష్యం వృద్ధులకు 'ఆర్థిక గౌరవాన్ని' కల్పించడం. ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్లు కేవలం మనుగడకు సరిపోతాయి. కానీ, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు లేదా మెరుగైన జీవన ప్రమాణాలు కావాలన్నప్పుడు అవి చాలవు. ఈ నేపథ్యంలోనే, పిల్లల సంపాదనపై తల్లిదండ్రులకు చట్టబద్ధమైన హక్కును కల్పించడం ద్వారా, వారు ఎవరిముందూ చేతులు చాచాల్సిన అవసరం ఉండదు. 15 శాతం జీతం అంటే చిన్న మొత్తం కాదు, అది ఒక వృద్ధ దంపతుల గౌరవప్రదమైన జీవనానికి సరిపోతుంది.
నైతికత వర్సెస్ చట్టం
ఈ నిర్ణయం వల్ల సమాజంలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చట్టం పట్ల భయం లేని వారికి, కనీసం ఆర్థికనష్టం కలుగుతుందనే భయంతోనైనా తల్లిదండ్రులను బాగా చూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక రకమైన 'బలవంతపు బాధ్యత' అయినప్పటికీ, బాధితులకు న్యాయం జరుగుతుంది. నేడు నగరాల్లో వృద్ధాశ్రమాలు కిక్కిరిసిపోతున్నాయి. పిల్లలు ఉండీ అనాథలుగా బతుకుతున్నవారికి ఈ చట్టం ఒక పెద్ద ఊరట. ఇంటిపట్టునే ఉండి, తమకు రావలసిన వాటాను పొందుతూ వారు మనశ్శాంతిగా శేష జీవితం గడపవచ్చు. రాబోయే తరాలకు ఇది ఒక గట్టి సందేశాన్ని పంపుతుంది. కన్నవారిని గౌరవించడం అనేది ఆప్షనల్ కాదు, అది తప్పనిసరి అని ఈ చట్టం గుర్తు చేస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం – పర్యవేక్షణ
తెలంగాణలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని కేవలం ప్రభుత్వ రంగంతోనే పరిమితం చేయకుండా, ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థలు, కార్పొరేషన్లకు కూడా వర్తింపజేయాలని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ట్రెజరీ ద్వారా చెల్లిస్తారు. జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత అధికారి ఆదేశాల మేరకు నేరుగా జీతంలో కోత విధించడం సాంకేతికంగా సులభం. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు, బాధ్యత గల అధికారులు విచారణ జరిపి, నిజంగానే నిర్లక్ష్యం జరుగుతోందని తేలితేనే ఈ చర్య తీసుకోవాలి. ఇది పారదర్శకంగా జరగడం ప్రధానం.
ఎదురయ్యే సవాళ్లు – ఆందోళనలు
ఏ చట్టమైనా అమలులోకి వచ్చేటప్పుడు కొన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదు. జీతం కట్ చేసిన తర్వాత, అదే ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఉండటం కష్టతరమవుతుంది. ఇది మరిన్ని గొడవలకు, మానసిక వేదనకు దారితీస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులు తమ ఇతర పిల్లల మాటలు విని లేదా ఆస్తి తగాదాల వల్ల ఒక కొడుకుపై ద్వేషంతో తప్పుడు ఫిర్యాదులు చేస్తే పరిస్థితి ఏంటి? దీనిని అరికట్టడానికి బలమైన 'అప్పీలేట్ అథారిటీ' అవసరం. ఐటీతోపాటు ఇతర ప్రైవేటు రంగాల్లో పనిచేసేవారిపై రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నియంత్రణ సాధించడం కష్టం. దీనికోసం కేంద్ర చట్టాల సాయం లేదా ప్రత్యేక లేబర్ రూల్స్
సవరించాల్సి ఉంటుంది.
చట్టం కంటే సంస్కారమే మిన్న
మనదేశంలో అస్సాంలో ఇప్పటికే అమల్లో ఉన్న 'ప్రణామ్' చట్టం స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది. అక్కడ కూడా ఉద్యోగి జీతం నుంచి 10-–15 శాతం వికలాంగులైన తోబుట్టువుల బాధ్యతను కూడా ఇందులో చేర్చడం ద్వారా చట్టం పరిధిని పెంచవచ్చు. తెలంగాణ ప్రభుత్వం దీనిని మరింత పకడ్బందీగా అమలు చేయాలని చూస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రక అవసరం. ఒక పక్క అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ, మరోపక్క తన సంస్కృతీ సంప్రదాయాలను, కుటుంబ విలువలను కాపాడుకోవడంలో వెనుకబడకూడదనే తపన ఇందులో కనిపిస్తోంది. కేవలం చట్టాల ద్వారా మాత్రమే
కుటుంబాల్లో ప్రేమానురాగాలను పెంచలేం. చట్టం అనేది చివరి అస్త్రం కావాలి. తల్లిదండ్రులను గౌరవించాలనే భావన సమాజంలో లోతుగా పాతుకుపోవాలి. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ '15 శాతం' భరోసా, కేవలం డబ్బు రూపంలోనే కాకుండా వృద్ధులకు ఒక 'ఆత్మగౌరవ చిహ్నం'గా నిలవాలి. ఈ చట్టం విజయవంతం కావాలంటే పారదర్శకమైన విచారణా వ్యవస్థ, వేగవంతమైన న్యాయం, సామాజిక అవగాహన ముఖ్యం. కన్నవారి కన్నీరు తుడిచే ఈ 'తల్లిదండ్రుల పోషణ బిల్లు' అక్షరాలా అమలులోకి వస్తే, వృద్ధాప్యంలో ఉన్న ఎందరికో అది నిజమైన 'ఆసరా' అవుతుంది.
- ఎక్కులూరి
నాగార్జున్ రెడ్డి,
సీనియర్ జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
