ఆర్టీసీపై ఐఏఎస్​ల కమిటీ

ఆర్టీసీపై ఐఏఎస్​ల కమిటీ
  • రిపోర్టు వచ్చాక ఆర్టీసీ పరిరక్షణకు చర్యలు
  • రాష్ట్ర కేబినెట్​లో నిర్ణయం
  • పండుగ సమయంలో సమ్మె వద్దని యూనియన్లకు విజ్ఞప్తి
  • ఆరోగ్యం, శానిటేషన్​ సహా పలు అంశాలపై సూచనలకు 8 కేబినెట్​ సబ్​ కమిటీలు
  •  పంటల సేకరణ విధానం, పౌల్ట్రీపై కొత్త పాలసీలు
  • యాక్షన్​ ప్లాన్​పై 10న మంత్రులు, కలెక్టర్లతో సీఎం మీటింగ్​

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కోసం సీనియర్ ఐఏఎస్ లతో కమిటీ వేయాలని కేబినెట్​ నిర్ణయించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  నేతృత్వంలో ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్ శర్మ సభ్యులుగా ఉండే ఈ కమిటీ బుధవారం ఆర్టీసీ కార్మికులతో చర్చిస్తుందని ప్రకటించింది. కార్మికుల డిమాండ్లను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వానికి వీలైనంత తొందరలో నివేదిక ఇస్తుందని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఇక ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేసేందుకు, ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను పరిశీలించేందుకు శాశ్వత ప్రాతిపదికన మంత్రివర్గ ఉప సంఘాలను నియమించాలని కేబినెట్  నిర్ణయించింది. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు, పౌల్ట్రీపై పాలసీలు రూపొందించాలని తీర్మానించింది.

సుదీర్ఘంగా భేటీ..

మంగళవారం సీఎం కేసీఆర్  అధ్యక్షతన ప్రగతి భవన్​లో కేబినెట్​ భేటీ జరిగింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై అభిప్రాయాలు తీసుకున్నట్టు సమాచారం. ముగ్గురు ఐఏఎస్​లతో కమిటీ వేయాలని, ఆ కమిటీ నివేదిక మేరకు ఆర్టీసీ పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్​ నిర్ణయించింది. ఆర్టీసీ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు, నష్టాల్లో ఉన్నందున సమ్మె యోచన విరమించుకుని సహకరించాలని కార్మికులకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చించాలని, డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని సూచించింది. ప్రభుత్వం కూడా సంస్థను కాపాడాలనే నిశ్చయంతో ఉందని, సమ్మెకు పోయి సొంత సంస్థను నష్టపర్చుకోవద్దని పేర్కొంది. ప్రజలంతా పండుగకు సొంతూర్లకు పోయే సమయంలో సమ్మె చేసి.. వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

రబీకి సిద్ధం కావాలి..

రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితిపై కేబినెట్  విస్తృతంగా చర్చించింది. వర్షాకాలంలో పండిన అన్ని రకాల పంటలను ప్రభుత్వపరంగా కొనుగోలు చేయడానికి పౌర సరఫరాల సంస్థతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు సిద్ధం కావాలని ఆదేశించింది. రబీకి కావాల్సిన విత్తనాలు, ఎరువులను ముందుగానే సమీకరించుకోవాలని సూచించింది. దీనికి అవసరమైన విధానం రూపొందించుకోవాలని పేర్కొంది.

ఎనిమిది కమిటీలివే..

ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేందుకు, ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు సబ్​ కమిటీలను నియమించాలని కేబినెట్  నిర్ణయించింది. 8 కమిటీలను ఏర్పాటు చేసింది. మంత్రి ఈటల రాజేందర్​ అధ్యక్షతన మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, తలసాని సభ్యులుగా వైద్య, ఆరోగ్య కమిటీని.. మంత్రి ఎర్రబెల్లి నేతృత్వంలో ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ సభ్యులుగా గ్రామీణ పారిశుధ్య కమిటీ.. మంత్రి కేటీఆర్​ అధ్యక్షతన హరీశ్ రావు, శ్రీనివాస్​ గౌడ్, తలసాని, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా పట్టణ పారిశుధ్య కమిటీ.. మంత్రి హరీశ్​రావు నేతృత్వంలో కేటీఆర్, శ్రీనివాస గౌడ్  సభ్యులుగా వనరుల సమీకరణ కమిటీ.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో కేటీఆర్, జగదీశ్ రెడ్డి, తలసాని, ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా పచ్చదనం కమిటీ.. మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి సభ్యులుగా వ్యవసాయ కమిటీ.. మంత్రి తలసాని అధ్యక్షతన శ్రీనివాస్​ గౌడ్, ఈటల, నిరంజన్ రెడ్డి సభ్యులుగా పౌల్ట్రీ కమిటీ.. మంత్రి కొప్పుల ఈశ్వర్  నేతృత్వంలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ సభ్యులుగా సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేశారు.

10న మంత్రులు, కలెక్టర్ల సమావేశం

గ్రామాల్లో ప్రస్తుతం అమలవుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై చర్చించడానికి ఈ నెల 10న సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రులు, కలెక్టర్లతో హైదరాబాద్ లో విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి డీపీవోలను, డీఎల్పివోలను కూడా ఆహ్వానించారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని కాపాడడానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో పాటు భవిష్యత్తులో చేయాల్సిన పనులపై ఆ సమావేశంలో చర్చిస్తారు.