కేంద్రానికి టీజీ ఫైల్..గెజిట్ విడుదలకు వారం రోజులు!

కేంద్రానికి టీజీ ఫైల్..గెజిట్ విడుదలకు వారం రోజులు!
  • కేబినెట్ నోట్​తో నేడు ఢిల్లీకి ఆర్టీఏ అధికారి

  • గెజిట్  విడుదలకు వారం రోజులు!

  • కేంద్రం గెజిట్ ఇస్తే, నోటిఫికేషన్  విడుదల చేయనున్న రాష్ట్ర సర్కారు

  • ఈ నెల 15 వరకు టైమ్ పడుతుందంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు : వెహికల్  నంబర్ల పేరును టీఎస్ నుంచి టీజీగా మార్చాలన్న రాష్ట్ర కేబినెట్  ఫైల్  మంగళవారం కేంద్ర రవాణా శాఖకు వెళ్లనుంది. పేరు మార్పుకు గల కారణాలను నోట్ రూపంలో కేంద్రానికి రాష్ట్ర రవాణా శాఖ పంపనుంది. ఈ ఫైల్ ను ఆర్టీఏ అధికారి కేంద్ర రవాణా శాఖకు తీసుకెళ్లి అక్కడి నుంచి గెజిట్  వచ్చేందుకు కేంద్ర అధికారులతో చర్చలు జరుపుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని పలు విభాగాల్లో ఫైల్  సర్యులేట్  అయి గెజిట్ వచ్చేందుకు సుమారు వారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి గెజిట్  వచ్చిన తరువాత రాష్ర్ట ప్రభుత్వం నోటిఫికేషన్  విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తికావడానికి సుమారు 10 రోజులు పట్టే అవకాశం ఉందని, ఈ నెల 15 తరువాతే నోటిఫికేషన్ వస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే రాష్ర్టంలో కొత్త వెహికల్స్ రిజిస్ర్టేషన్లకే టీజీ పేరు అమలవుతుందని చెప్పారు.

కేంద్రం టీజీ అని ఇస్తే టీఎస్ గా మార్చిండు

తెలంగాణ ఏర్పాటు సమయంలో కేంద్ర రవాణా శాఖ.. రాష్ర్టం పేరును టీజీగా ఖరారు చేస్తూ 2014 లో గెజిట్  జారీ చేసింది. ఆ గెజిట్​కు భిన్నంగా మాజీ సీఎం కేసీఆర్.. టీజీ అని కాకుండా టీఎస్  పేరును ఖరారు చేశారని అధికారులు చెబుతున్నారు. అప్పుడు అభ్యంతరం తెలిపినా కేసీఆర్  పట్టించుకోలేదని తెలిపారు. ఆయన పార్టీ పేరు కలిసొచ్చేలా టీజీని టీఎస్​గా మార్చారని సోషల్  మీడియాలో పలువురు గుర్తుచేస్తున్నారు. టీఎస్ పేరును టీజీగా మార్చడం మంచి నిర్ణయం అని పలువురు చెబుతున్నారు. ఇందుకు ఇతర రాష్ట్రాల  కోడ్​లను సోషల్ మీడియాలో పోస్ట్  చేస్తున్నారు. మూడు అక్షరాలున్న గోవా రిజిస్ట్రేషన్ కోడ్ జీఏ,  కేరళ కేఎల్, సిక్కిం ఎస్​కే, కర్నాటక కేఏ, ఢిల్లీ డీఎల్, ఒడిశా ఓడీ, మహారాష్ట్ర ఎంహెచ్, హర్యానా హెచ్ఆర్, పంజాబ్ పీబీ, తమిళనాడు టీఎన్, గుజరాత్​కు జీఏ పేర్లు ఉన్నాయని, ఏ రాష్ట్రం చూసినా టీఎస్  లాంటి కోడ్  కనపడదని ప్రజలు అంటున్నారు. టీఆర్ఎస్ లా కనిపించేందుకు అప్పటి ప్రభుత్వం టీఎస్ అని పెట్టిందని, ఉద్యమ కాలంలో చాలా మంది త‌‌‌‌మ వాహనాలపై టీజీ  అని రాసుకున్నారని, ఆంధ్రా బ్యాంక్  మీద టీజీ  బ్యాంక్  అని రాసి అప్పట్లో నిరసన తెలిపారని గుర్తుచేస్తున్నారు. తమ ప్రభుత్వం వస్తే  టీఎస్  పేరును టీజీగా మారుస్తామని 2022 సెప్టెంబర్​లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను సోషల్  మీడియాలో సర్క్యులేట్  చేస్తున్నారు.

కొత్త వెహికల్స్​కే టీజీ

కేబినెట్ నిర్ణయం తర్వాత పాత వెహికల్స్​కి కూడా టీఎస్ పేరును టీజీగా మార్చుకోవాలా అని వాహనదారులు డైలమాలో ఉన్నారు. కొత్త వెహకల్స్ రిజిస్ర్టేషన్లకు మాత్రమే టీజీ పేరు అమలవుతుందని, పాత వెహికల్స్  టీఎస్​గానే కొనసాగుతాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు కోటిన్నర ఉన్నాయి. నిత్యం 3 వేల వెహికల్స్​ వరకు రిజిస్ర్టేషన్ అవుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ  రిజిస్ట్రేషన్​తో ఉన్న వాహనాలను మార్చుకోవాల్సిన అవసరం లేదని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. 2014 జూన్ 2 తర్వాత కొన్న వాహనాలకే టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్  చేశారు. తెలంగాణకు చెందిన వెహికల్స్ అయినా.. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు కొన్న వాహనాలకు పేరు మార్చలేదు. ప్రభుత్వం ఈ అంశంపై నోటిఫికేషన్ లో వివరించనుందని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.